ఆర్టీసీ బస్సులోనే ప్రసవం
-బస్సుతో సహా ఆసుపత్రికి తీసుకువెళ్లిన డ్రైవర్, కండక్టర్
-ఆర్టీసీలో చిన్నారికి జీవితకాలం ఉచిత ప్రయాణం
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నిండు గర్బిణీ అందులోనే ప్రసవించిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉట్నూర్ నుంచి చంద్రపూర్ వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో ఇంద్రవెల్లి లో రత్నమాల అనే గర్భిణీ ఎక్కింది. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఆమె ఆ బస్సులో ఆదిలాబాద్ వస్తుండగా, గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ వద్ద నొప్పులు ప్రారంభం అయ్యాయి. అక్కడే బస్సులోనే మగ శిశువుకి జన్మనిచ్చింది. ఇది గమనించిన డ్యూటీలో ఉన్న కండక్టర్ గబ్బర్‌సింగ్, డ్రైవర్ బస్సులో ఉన్న మహిళల సహాయంతో గుడిహత్నూర్ లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్లారు. తల్లి బిడ్డను క్షేమంగా హాస్పిటల్లో చేర్చారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆదిలాబాద్ డీఎం విజయ్, డీవీఎం మధుసూదన్ గుడిహత్నూర్ ఆసుపత్రికి వెళ్లి తల్లి, బాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం టీఎస్ ఆర్టీసీ బస్సు ప్రయాణ సమయంలో జన్మించిన బిడ్డకు జీవితకాలం ఉచిత ప్రయాణం ఉంటుందని వెల్లడించారు. డ్యూటీలో సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లిబిడ్డలను క్షేమంగా ఆసుపత్రికి చేర్చిన కండక్టర్, డ్రైవర్ ని డీఎం విజయ్, డీవీఎం మధుసూదన్ ప్రశంసించారు.