కొనసాగుతున్న సహాయక చర్యలు..
అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైన్యం అమర్నాథ్లో సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మరోవైపు ఈ యాత్రలో జరిగిన విషాదంలో మృతుల సంఖ్య 16కు చేరింది. వరదల్లో మరో 40 మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా.. కొండచరియలు విరిగి పడకపోవడంతో సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగడం లేదు. NDRF, ఆర్మీ, SDRF, CRPF, ఇతర భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
ఇప్పటి వరకు 15 వేల మంది యాత్రికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల గాయపడ్డ దాదాపు 65 మందిని హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. అమర్ నాథ్ గుహ దగ్గర చిక్కుకున్న వారిని పంచతరణి బేస్ క్యాంపు తరలించారు. శుక్రవారం ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షం కారణంగా పై నుంచి భారీగా వరద ముంచెత్తింది. పెద్ద పెద్ద రాళ్లు, బురద కొట్టుకొచ్చాయి. దీంతో యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో పరుగులు తీయడంతో.. తొక్కిసలాట జరిగింది. అనేక మంది గాయపడ్డారని తెలిపారు అధికారులు. అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు.