మాతా, శిశు సంరక్షణా కేంద్రం వెంటనే సిద్ధం చేయండి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ భారతీ హోళీకేరీ
మంచిర్యాల :మాతా, శిశు కేంద్రంలో పేరుకుపోయిన చెత్తా,చెదారం తొందరగా తొలగించి వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం వరద ముంపునకు గురైన మాతా,శిశు కేంద్రం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరద కారణంగా దెబ్బతిన్న ఆసుపత్రి పరికరాలకు అవసరమైన మరమ్మత్తులు చేయించాలన్నారు. ఆయా వార్డులు, ఆసుపత్రి పరిసరాలలో పేరుకుపోయిన చెత్తా,చెదారం యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. రోగులకు సేవలు అందించేందుకు సిద్దం చేయాలని తెలిపారు. అనంతరం మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావుతో కలిసి మంచిర్యాల పట్టణంలోని ఎన్.టి.ఆర్. నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మాట్లాడుతూ ముంపు గురైన బాధితులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. వరద కారణంగా వార్డులో పేరుకుపోయిన పూడిక, చెత్తా, చెదారాన్ని వెంటనే తొలగించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని అందించడంతో పాటు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంచిర్యాల మండల తహశిల్దార్ రాజేశ్వర్,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.