వరదతో తీవ్ర నష్టం : వివాహిత ఆత్మహత్య
రూపాయి, రూపాయి కూడబెట్టుకున్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం కలలు కన్నారు.. వారికి ఓ సొంత గూడు కావాలని కోరుతున్నారు. తమ కష్టార్జితంతో పాటు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. కానీ మాయదారి వరదలు ఆ ఇంటిని ముంచేశాయి. తమ కష్టార్జితం నీటిలో మునిగిపోవడం దానికి మళ్లీ ఎంత ఖర్చవుతుందో దిక్కుతోచని స్థితిలో పడింది ఆ వివాహిత.. ఆత్మహత్య చేసుకుంది.
సిద్ది జమున అనే మహిళ తన భర్తతో కలిసి మంచిర్యాల మార్కెట్లో చిరువ్యాపారం చేస్తోంది. తమకు వచ్చే డబ్బులు పొదుపు చేసుకుని వాటిని కూడబెట్టి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటికి లోన్ సైతం తీసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీటి మునిగాయి. బాలాజీనగర్లో సైతం ఇండ్లు వరద ముంపునకు గురయ్యాయి. కష్టపడి పోగేసుకుని కట్టుకున్న ఇల్లు నీట మునగడంతో పాటు దానిని రిపేరు చేసేందుకు డబ్బులు కూడా కావాలి. ఇల్లు కట్టుకోవడానికే ఎంతో కష్టపడ్డ ఆ కుటుంబానికి మళ్లీ మరమ్మతులు అంటే భారమే.
అందుకే మనస్తాపానికి గురైన సిద్ది జమున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాఫ్తు చేపట్టారు.