బ్రిడ్జి క‌డ‌తారా..? నీట ముంచుతారా..?

-ధన్నూర్ ప్ర‌జ‌ల వినూత్న నిర‌స‌న‌
-లో లెవ‌ల్ వంతెన‌పై నిల‌బ‌డి ఆందోళ‌న
-క‌లెక్ట‌ర్ రావాలంటూ నినాదాలు

త‌మ స‌మ‌స్య‌లు నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌చ్చి కేవ‌లం ఓట్లు వేయించుకుని వెళ‌తారు. మ‌ళ్లీ ష‌రా మామూలే. త‌మ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌రు. చెప్పి చెప్పి విసుగు చెందిన ప్ర‌జ‌లు ఇక లాభం లేద‌నుకుని త‌మ స‌మ‌స్య ప‌రిష్కారానికి వినూత్న రీతిలో నిరస‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని ధన్నూర్ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటి వెళ్లాల్సి ఉంటుది. దానిపై ఎన్నో ఏండ్ల కింద‌ట క‌ట్టించిన లో లెవ‌ల్ వంతెన ఉంది. వ‌ర్షం ఎక్కువ ప‌డి వాగు ఉధృతి పెరిగితే రాక‌పోక‌లు నిలిపోతాయి. దానిని దాటుకుని వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంది. కొద్దిపాటి వర్షాలకే గ్రామానికి రాకపోకలు నిలిచిపోయి చనిపోయిన శవాన్ని ఇంటి వాకిట్లోనే ఖననం చేసే దీన స్థితిలో లో ఉందంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. దీంతో త‌మ‌కు బ్రిడ్జి నిర్మించాల‌ని ఎన్నో ఏండ్లుగా కోరుతున్నా ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇవ్వ‌డం… ఆ త‌ర్వాత స‌మ‌స్య మ‌రిచిపోవ‌డం సాధారణంగా మారింది. వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు ప్ర‌జ‌లు న‌ర‌కం చూస్తున్నారు. అయినా నేత‌ల‌కు క‌నిక‌రం క‌ల‌గ‌డం లేదు.

దీంతో, ధ‌న్నూర్ గ్రామ‌స్తులు త‌మ స‌మ‌స్య ప‌రిష్కారించాల‌ని భారీ వర్షం లో లో లెవల్ వంతెన పై నిలబడి నిరసన తెలుపుతున్నారు. బ్రిడ్జి కడతారా…? మమ్మల్ని నీట ముంచుతారా..? అంటూ ఆ బ్రిడ్జిపై నిల‌బ‌డి ఆందోళ‌న చేస్తున్నారు. వాగు ఉదృతం గా ప్రవహిస్తూ బ్రిడ్జి మీదకి వచ్చే అవకాశం ఉంది. అయినా పట్టువీడని గ్రామస్థులు కచ్చితమైన హామీ వచ్చేవరకు బ్రిడ్జి మీద నుండి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బ్రిడ్జి ఇస్తారా మమ్మల్ని చంపుతారా అంటూ ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. క‌లెక్ట‌ర్ రావాలంటూ నినాదాలు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like