పాలిస్తూనే… ప్రాణాలు వదిలిన తల్లి..
రెండు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
రెండు నెలల చిన్నారికి పాలు ఇస్తూనే మహిళ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లికి చెందిన జయశ్రీ(25)కి కొన్నాళ్ల క్రితం రాజాపూర్ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో వివాహమైంది. తొలికాన్పు కోసం నేరళ్లపల్లికి వచ్చిన ఆమె రెండు నెలల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిరోజుల క్రితం జయశ్రీ తల్లిదండ్రులు, అత్తమామలు తీర్థయాత్రలకు తమిళనాడు వెళ్లడంతో ఆమె బాగోగులు తాత, అమ్మమ్మ చూసుకుంటున్నారు.
ఇటీవల జయశ్రీ అస్వస్థతకు గురికావడంతో భర్త ప్రశాంత్ తిర్మలాపూర్ నుంచి శనివారం వచ్చి మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జయశ్రీ గుండె వాల్వులో చిన్న ఇబ్బంది ఉందని మందులు వాడితే సరిపోతుందని డాక్టర్లు చెప్పడంతో మళలీ నేరళ్లపల్లిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో జయశ్రీ తన బిడ్డకు పాలిస్తూ మంచంపైనే ప్రాణాలు కోల్పోయింది. కాసేపటికి తాత, అమ్మమ్మ టీ కోసం పిలిచినా ఆమె లేవలేదు. అనుమానంతో వారు గదిలోకి వెళ్లి చూడగా జయశ్రీ విగతజీవిగా కనిపించింది. దీంతో వారు జయశ్రీ భర్తకు సమాచారం ఇచ్చారు. ఆయన డాక్టర్‌ని తీసుకొచ్చి పరీక్ష చేయించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.