ప్రాజెక్టుల పరవళ్లు…
-స్వర్ణ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత
-సాత్నాల రెండు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల
-మత్తడి వాగు మూడు గేట్లు, గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తివేత
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు,భైంసాలోని గడ్డెన్న వాగు, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాత్నాల ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 286.50 మీటర్లు కాగా.. ప్రస్తుతం 284.70 మీటర్ల వరకు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 4600 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండడంతో రెండు గేట్లు ఎత్తిన అధికారులు నీటిని బయటకు వదులుతున్నారు. మత్తడి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా.. ప్రస్తుతం 276.60 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుల మూడు గేట్లను ఎత్తిన అధికారులు 9228 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 360.56 మీటర్లు కాగా.. ప్రస్తుతం 359.8 మీటర్ల వరకు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 30,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండడంతో రెండు గేట్లు ఎత్తిన అధికారులు నీటిని బయటకు వదులుతున్నారు. కడెం జలాశయానికి వరద వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 679.025 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 13,735క్యూసెక్కుల వరద వస్తుండగా.. 10,683 క్యూసెక్కుల నీరు 17 గేట్ల ద్వారా బయటకు వెళ్తోంది.