విద్యాశాఖ మంత్రికి ఇంగితజ్ఞానం లేదా..?
-పిల్లల భవిష్యత్ ఫణంగా పెడతారా
-సినిమా షూటింగ్ కోసం రూ. 4 కోట్లతో పాఠశాల మరమ్మతులు
-నామినేషన్ వేసి మరీ పనులు చేయిస్తున్నారు
-సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
-సినిమా షూటింగ్ అడ్డుకున్న బీజేపీ నేతలు
‘ఒక విద్యాలయంలో పాఠాలు నడుస్తుండగా షూటింగ్ అనుమతి ఇచ్చారు. పాఠశాల బాలేదు… కాంపౌండ్ వాల్ కావాలంటే కనీసం పట్టించుకోలేదు. సినిమా షూటింగ్ కోసం ఏకంగా పాఠశాలకు రూ.4 కోట్లు కేటాయించి నాసిరకం పనులు చేయిస్తున్నారు. కనీసం కాంట్రాక్టు వర్క్ కూడా కాకుండా నామినేషన్ వేసి పనులు చేయిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇలాఖాలోనే ఇంత దారుణం జరుగుతోంది. ఆమెకు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదా…? -సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్
సరూర్ నగర్ వీఎం హోంలో రామ్ చరణ్ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల తరగతులు జరుగుతున్న వేళ షూటింగులకు అనుమతి ఏ విధంగా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి సినిమా షూటింగ్ కు అనుమతి ఇచ్చారని దుయ్యబట్టారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా నాణ్యత మైన విద్యను అందించాల్సిన బాధ్యత మరిచి షూటింగుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఖజానాలను నింపుకుంటుందన్నారు. షూటింగ్ అనుమతి ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. సినిమా షూటింగ్ వెంటనే నిలిపివేయాలని బీజేపీ నేతలు కోరారు.