ఒక మంత్రి.. 140 మంది అనుచరులు
-నిబంధనలు ఉల్లంఘించి తిరుమలలో దర్శనం
-మంత్రి సేవలో తరించిన టీటీడీ అధికారులు
-ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సామాన్య ప్రజలు
శ్రీవారి దర్శనంలో సామాన్య ప్రజలకు పెద్ద పీట వేస్తామని ప్రగల్భాలు పలికే టీటీడీ అధికారులు వాస్తవంలో అలాంటివి ఏవీ పాటించడం లేదు. మంత్రులు, నేతల సేవలో తరిస్తున్నారు. ఎన్నిమార్లు ఇలాంటి ఘటనలు వెలుగు చూసినా వారిలో మార్పు రావడం లేదు.
తిరుమలలో మంత్రి సీదిరి అప్పలరాజు హల్‌చల్ చేశారు. పెద్ద ఎత్తున అనుచరులతో తిరుమల వచ్చిన ఆయన వాళ్లందరికీ ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని పట్టుబట్టారు. అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అధికారులు సైతం నిబంధనలు పక్కన బెట్టి 140 మంది అనుచర వర్గానికి ప్రోటోకాల్ దర్శనం కల్పించారు. ఇలా ఇష్టారాజ్యంగా నిబంధనలు పక్కన బెట్టి సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తూ వందలాది మందికి ప్రొటోకాల్ దర్శనం కల్పించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా ఓ కార్యక్రమంలో మంత్రి అనుచరులను అడ్డుకున్నారని సీఐపై చేయి వేసి తోసేశారు కూడా. అక్కడ కొద్దిపాటు వివాదం చెలరేగింది. అనంతరం ఆ సీఐని వీఆర్ కి పంపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని మంత్రి సీదిరి అప్పలరాజు పరుష పదజాలంతో దుర్భాషలాడి.. దౌర్జన్యం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఇలా తన అనుచరుల కోసం మంత్రి హల్ చల్ చేయడం అక్కడ కామన్‌గా మారింది. ఇదంతా ఒక్కెత్తు కాగా, మంత్రి సేవలో టీటీడీ అధికారులు తరించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.