‘రాష్ట్రపత్ని’ వివాదం.. చిక్కుల్లో కాంగ్రెస్
-ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన
-ఎంపీపై చర్యలు తీసుకోవాలని సోనియాకు మహిళా కమిషన్ లేఖ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీ చేసిన వ్యాఖ్యలు… ఆ పార్టీని చిక్కుల్లో పడేశాయి. అటు బీజేపీ ఈ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేయగా, జాతీయ మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్రపతిపై రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై సోనియా గాంధీ లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్తూ.. ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ లేఖ రాసింది.
జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖ శర్మ.. అధిర్ రంజన్ చౌదరికి నోటీసులు జారీ చేశారు. తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని.. వ్యాఖ్యలపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. ఆగస్టు 3వ తేదీ ఉదయం 11:30 గంటలకు విచారణ ఉంటుందని లేఖలో తెలిపింది. అదేవిధంగా.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కూడా జాతీయ మహిళా కమిషనర్ లేఖ రాసింది. సోనియా గాంధీ ఈ వివాదంలో జోక్యం చేసుకుని.. అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈ వ్యవహారంపై రేఖ శర్మ స్పందిస్తూ.. అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు దిగజారిన పనులకు నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అని సంబోధించడం ఆయన మైండ్‌సెట్‌ను ప్రతిబింబిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. అధిక్ రంజన్ రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదే సమయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీని సైతం టార్గెట్ చేసింది. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం ఆ పార్టీకి ఇష్టం లేదని, గిరిజన బిడ్డ అయిన ఆమెపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జాతీయస్థాయిలో బీజేపీ శ్రేణులు, ఆదివాసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేశాయి. ఈ వివాదం పెద్దదిగా మారుతుండటంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది.