క్యాత‌న్‌ప‌ల్లి మున్సిప‌ల్ స‌మావేశం బ‌హిష్క‌రించిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు

-త‌మ‌కు ప్ర‌త్యేకంగా నిధులు ఇవ్వ‌డం లేద‌ని అల‌క‌
-గ‌తంలో మాటిచ్చి త‌ప్పార‌ని చైర్‌ప‌ర్స‌న్‌పై ఆగ్ర‌హం
-ఎజెండా కాపీ సైతం తీసుకోకుండా నిర‌స‌న‌

త‌మ‌కు ప్ర‌త్యేకంగా నిధులు ఇస్తామ‌ని ఇవ్వ‌డం లేద‌ని అందుకే తాము మున్సిప‌ల్ స‌మావేశం బాయ్‌కాట్ చేస్తున్న‌ట్లు ముగ్గురు టీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు వెల్ల‌డించారు. శుక్ర‌వారం మంచిర్యాల జిల్లా క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశాన్ని టీఆర్ఎస్ కౌన్సిల‌ర్లే బాయికాట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటీకి చెందిన 7వ వార్డు కౌన్సిల‌ర్ పొలం స‌త్యం, 8వ వార్డు కౌన్సిల‌ర్ శ్రీ‌ల‌త‌, 9వ వార్డు కౌన్సిల‌ర్ పారుపెల్లి తిరుప‌తి స‌మావేశం బాయ్‌కాట్ చేశారు. అంత‌కుముందు చైర్‌ప‌ర్స‌న్ జంగంక‌ళ‌, వైస్ చైర్మ‌న్ విద్యాసాగ‌ర్ రెడ్డి,ఇన్‌చార్జి క‌మిష‌న‌ర్ నాగ‌రాజు, ఏఈ అచ్యుత్‌, కొంద‌రు కౌన్సిల‌ర్ల ఆధ్వ‌ర్యంలో చ‌ర్చ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తాము ఉన్న ప్రాంతంలో ప‌ట్ట‌ణం అభివృద్ధి చెందుతోంద‌ని అందుకే త‌మ‌కు ప్ర‌త్యేకంగా నిధులు కావాల‌ని డిమాండ్ చేశారు.

త‌క్కువ జ‌నాభా ఉన్న రామ‌కృష్ణాపూర్‌తో పాటు ప‌ట్ట‌ణం అభివృద్ధి చెందుతున్న ప్రాంతం (గేటు అవ‌త‌ల ప్రాంతం) ఒకేలా నిధులు ఇవ్వ‌డం ఏమిట‌ని వారు ప్ర‌శ్నించారు. జ‌న‌ర‌ల్ ఫండ్ నుంచి ప్ర‌త్యేక నిధులు కావాల‌ని, వార్డుల అభివృద్ధి కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. త‌మ‌కు చైర్‌ప‌ర్స‌న్ గ‌తంలో మాటిచ్చార‌ని అయినా ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. తాము స‌మావేశంలోకి వ‌చ్చేది లేద‌ని భీష్మించుకుని కూర్చున్నారు. చైర్‌ప‌ర్స‌న్‌, వైస్ చైర్మ‌న్ ఎంత బ‌తిమిలాడినా వినిపించుకోలేదు.

ఎనిమిదవ వార్డు కౌన్సిల‌ర్ శ్రీ‌ల‌త మున్సిప‌ల్ స‌మావేశానికి రాకుండానే వెళ్లిపోయారు. ఇక 7వ వార్డు కౌన్సిల‌ర్ పొలం స‌త్యం, 9వ వార్డు కౌన్సిల‌ర్ పారుపెల్లి తిరుప‌తి స‌మావేశ మందిరానికి వ‌చ్చి తాము స‌మావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్న‌ట్లు చెప్పి మ‌రీ వెళ్లారు. మున్సిప‌ల్ సిబ్బంది ఎజెండా కాపీ ఇచ్చేందుకు మూడు రోజుల కింద‌ట వెళ్లినా అది తీసుకోకుండా త‌మ‌కు అక్క‌ర‌లేద‌ని తిప్పి పంపించిన‌ట్లు స‌మాచారం. స‌మావేశ మందిరంలో మూడ‌వ వార్డు కౌన్సిల‌ర్ స్ర‌వంతి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్ం చేశారు. స‌మావేశాల‌కు త‌మ‌కు స‌రైన స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. జులైలో జ‌రిగిన అత్య‌వ‌స‌ర స‌మావేశానికి త‌నకు ఆహ్వానం అంద‌లేద‌న్నారు. ఆమె లోప‌ల హాల్‌లో గొడ‌వ చేస్తుండ‌గా, భ‌ర్త స‌త్య‌నారాయ‌ణ బ‌య‌ట గొడ‌వ చేయ‌డం గ‌మ‌నార్హం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like