విలేకరులమని డబ్బు వసూలు : ఒకరి అరెస్టు
విలేకరుమని చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు జైపూర్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు అతన్ని రిమాండ్ పంపించారు. అతని వద్ద నుంచి 16 వేల రూపాయలు, ఒక బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారని స్పష్టం చేశారు.
మానుపటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈనెల 28న బంధువుల ఇంట్లో ఫంక్షన్ కోసం ట్రాలీ తీసుకుని వెళ్లాడు. ఆ ట్రాలీ లో పంట బియ్యం, కొన్ని సామాన్లు తీసుకొని వెళ్లాడు. మార్గ మధ్యలో నర్వ గ్రామం వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ట్రాలీని అడ్డగించి మేం విలేకరమని చెప్పి శ్రీనివాస్ వద్ద నుండి సెల్ ఫోన్ లాక్కున్నారు. ట్రాలీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని పోలీసు, సివిల్ సప్లై వారికి ఫిర్యాదు చేసి మీపై కేసు నమోదు చేయిస్తామని బెదిరించారు. అంతేకాకుండా, ట్రాలీలను సైతం సీజ్ చేయిస్తామని హెచ్చరించారు.
బాధితుడు ఇవి రేషన్ బియ్యం కావు మా పొలంలో పండిన పంట బియ్యం అని చెప్పినా వినకుండా ఏ బియ్యమైనా సరే వాటిని రేషన్ బియ్యం అని పేపర్లో రాస్తామని బెదిరించారు. మీపై కేసు నమోదు కావద్దు పేపర్లో రాయవద్దు అంటే మాకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి భయపడి బాధితుడు రూ.26 వేలు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న నిందితులు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ అంతు చూస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మానుపటి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జైపూర్ ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరు తొర్రం శ్రీధర్ గా గుర్తించి శనివారం అతన్ని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు స్పష్టం చేశారు.
పలువురు యూట్యూబర్లు ఇదే విధంగా మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్ ప్రధాన రహదారిల్లో ఉంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనికి కొందరు అధికారులు సైతం సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా వారిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.