కలెక్టరేట్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తన భూమి నుంచి దారి వేయడమే కాకుండా, చుట్టూ ట్రెంచ్ కొట్టి గ్రామస్తులు వేధిస్తున్నారని ఓ బాధితుడు నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. సోన్ మండలం సంగెంపేటకి చెందిన గొర్రె లింగన్న కు నాలుగు ఎకరాల భూమి ఉంది. గ్రామస్తులు కక్షగట్టి తన భూమిలో నుంచి రోడ్డు వేశారని, తనను ఇబ్బందులకు గురి చేశారని గతంలో పోలీస్ స్టేషన్ తో పాటు అధికారులకు ఫిర్యాదు చేశాడు. చివరికి హైకోర్టు ఉత్తర్వులతో లింగన్నకు భూ కేటాయింపు చేశారు. కాని గ్రామస్తులు వారం కిందట మళ్లీ రోడ్డు వేసి భూమి చుట్టూ ట్రెంచ్ వేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోయాడు. నాలుగు సంవత్సరాల నుండి పక్క గ్రామ వ్యక్తితో, కలిసి తమ గ్రామానికి చెందిన కొందరు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన వ్యవసాయ భూమిలోకి వెళ్లకుండా వేధిస్తున్నారని పేర్కొన్నాడు, గతిలేని పరిస్థితిలో భార్యతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చానని తెలిపాడు. సమస్య పరిష్కారం కావడం లేదని బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు బాధితుడు వెల్లడించాడు. ఒక పక్క కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడంతో అధికారులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అధికారులు,కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బాధితుని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.