అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తా
యూనివర్సిటీల విద్యార్థులతో గవర్నర్ తమిళి సై
త్వరలో తాను అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తానని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో తనను కలిసిన బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ విద్యార్థులతో ఆమె మాట్లాడారు. సమావేశంలో బాసర ఐఐఐటీ విద్యార్థులతో పాటు తెలంగాణలోని యూనివర్సిటీ విద్యార్థులు సైతం పాల్గొన్నారు. యూనివర్సిటీల్లో సమస్యలపై విద్యార్థులతో ప్రధానంగా చర్చించిన గవర్నర్. తమ యూనివర్సిటీలలో ఉన్న సమస్యలు విద్యార్థులు
గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. బాసర త్రిబుల్ ఐటి లోని పలు సమస్యలను విద్యార్థులు ప్రస్తావించారు. అన్ని వర్శిటీలను సందర్శిస్తానని గవర్నర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా గవర్నర్ విద్యార్థులకు జాతీయ జెండాలు అందించారు.
ఓయూ విద్యార్థులు సైతం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ నేత సురేష్ మాట్లాడుతూ గవర్నర్ ను కలిసామని, .సమస్యలు చెప్పుకున్నామని స్పష్టం చేశారు. ఏపిలో మూడు ట్రి బుల్ ఐటీ లు అభివృద్ధి చెందాయని, తెలంగాణలో ఉన్న ఒక్క త్రిబుల్ ఐటి ని అభివృద్ధి చేయడం లేదని అవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో 5 ఏళ్ల నుంచి పీహెచ్ డి నోటిఫికేషన్ లు లేవని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. డోనేషన్ ల పేరుతో బీటెక్ సీట్లు అమ్ముకుంటున్నారని తెలిపారు. గతంలో ఏ గవర్నర్ ఇంత మంచిగా స్పందించలేదని విద్యార్థులు స్పష్టం చేశారు. అన్ని యూనివర్సిటీలకు వస్తానని గవర్నర్ చెప్పారని వారు వెల్లడించారు.