గవర్నర్ కు కుర్చీ కూడా లేదా..?
-అధికారుల తీరుపై పలువురి ఆగ్రహం
-రోడ్డు పక్కనే మీడియా సమావేశం
-నిలబడే మాట్లాడిన గవర్నర్
ఓ మంత్రి వస్తే జిల్లా యంత్రాంగం వాలిపోతుంది.. చివరకు ఓ ఎమ్మెల్యే వచ్చినా అధికారులు, పోలీసులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. కానీ ఇక్కడ వచ్చింది సాదాసీదా మహిళ కాదు.. ఈ రాష్ట్రానికే ప్రథమ పౌరురాలు… ఆమె వచ్చినా కనీస మర్యాదలు కూడా ఇవ్వకుండా, ప్రొటోకాల్ మరిచిన అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
గవర్నర్ జిల్లాకు వస్తే కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు అందరూ వచ్చి స్వాగతం పలకాల్సి ఉండగా దాదాపు ఉన్నతాధికారులు అంతా దూరంగా ఉన్నారు. కలెక్టర్ ముషారఫ్ అలీ సెలవుపై వెళ్లగా, ఎస్పీ ప్రవీణ్ పర్యటనకు రాలేదు. భైంసాలో ఉన్న ఐపీఎస్ అధికారి కూడా రాలేదు. ఇదంతా ఒక్కెత్తు కాగా, గవర్నర్ విద్యార్థులతో మాట్లాడి బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో పాల్గొనాల్సి ఉంది.
దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసి అంతా నివ్వెరపోయారు. ఎందుకంటే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది రోడ్డు పక్కన. అది కూడా బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటుకు దూరంగా. నడిరోడ్డు పక్కనే ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గవర్నర్ కూర్చునేందుకు కనీసం కుర్చీ కూడా వేయలేదు. కేవలం రెండు బల్లలు వేసి దానిపై మీడియా లోగోలు ఉంచేందుకు ఏర్పాటు చేశారు. దీంతో గవర్నర్ చేసేదేమీ లేక నిలబడే మాట్లాడి అక్కడి నుంచే వెళ్లిపోయారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య ఏమైనా ఉండొచ్చు… భేషజాలు, బేదాభ్రిపాయలు సైతం తలెత్తవచ్చు. కానీ, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్ తమిళ్సై అంత పెద్ద విద్యాసంస్థకు వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కనీసం కుర్చీ సైతం వేయకుండా అవమానించిన అధికారుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత జరిగినా గవర్నర్ చిరునవ్వుతో దాదాపు 12 నిమిషాల పాటు విలేకరుల సమావేశం నిర్వహించారు.
చివరగా గవర్నర్ రాష్ట్రంలో ప్రొటోకాల్ ఎక్కడ ఉందంటూ, అది ఓపెన్ సీక్రెట్ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. తాను తల్లిగా స్పందించి ట్రిపుల్ ఐటీకి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని, వాటి పరిష్కరించడానికి మార్గాలు మాత్రమే వెతుకుతానని తన ప్రొటోకాల్ గురించి చర్చ జరిగితే అసలు సమస్య పక్కదారి పట్టే అవకాశం ఉందని అందుకే దాని గురించి ఎక్కువగా మాట్లాడబోనంటూ వ్యాఖ్యానించారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, చివరకు సర్పంచ్లు, మందీ మార్బాలాన్ని లోపలికి పంపిన పోలీసులు, అధికారులు… గవర్నర్ తమిళ్సై పర్యటనలో మాత్రం ఎవరినీ అనుమతించలేదు. మీడియాను కూడా అనుమతించడకపోవడం ఏమిటనే దానిపై ఏం సమాధానం చెబుతారో..?