చావడానికైనా సిద్ధమే
-తెలంగాణలో రాముడిని తిట్టే వారికే విలువ
-రెండో వీడియో త్వరలో అప్లోడ్ చేస్తా
-బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
BJP MLA Raja Singh Arrest : ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా మాట్లాడారనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఎమ్మెల్యే విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎంఐఎం నేతలు ధర్నాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం ఉదయం రాజాసింగ్ నివాసానికి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన ఉదయం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రాముడిని కొలిచే వారికే విలువ లేదని.. తిట్టే వారికే విలువ ఉందన్నారు. రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారూఖీని హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినా షో ప్రదర్శించారని అన్నారు. దండం పెట్టి వేడుకున్నా పోలీసులు వినలేదన్నారు. రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని కేటీఆర్ ను ప్రశ్నించారు. ప్రధానికి కూడా కల్పించనంత భద్రత మునావర్ ఫారూఖికి ఇచ్చి.. షో ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మునావర్‌కు కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చేప్పాను. కౌంటర్ వీడియోను యూట్యూబ్‌లో తొలగించారు. రెండో భాగం వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది. నాపై ఎలాంటి చర్యలకు దిగినా నేను సిద్ధం. ధర్మం కోసం నేను చావడానికైనా రెడీగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు.