అక్రమ రవాణా గురించి చెబితే మాపైనే కేసులంట..
-అధికారపార్టీ అండతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు
-పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు
Illegal shipment of ration rice: తాము ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి ఫిర్యాదు చేస్తే అధికార పార్ట అండదండలతో తమపైనే కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు వాపోయారు. బాధ్యత గల పౌరులుగా తాము పనిచేస్తే పోలీసులు తమనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీసీపీకి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే…
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచినికి చెందిన తాళ్లపెల్లి భాస్కర్ గౌడ్, ఆదె శ్రీను శనివారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో రేషన్ డీలర్ కొలిపాక శ్రీనివాస్ తమ్ముడు ఇంట్లోని రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారాన్ని గమనించారు. టాటా మ్యాజిక్ (ఎపి01 టివి 3446) తరలిస్తున్న సమయంలో భాస్కర్ గౌడ్, ఆదె శ్రీను అడ్డుకున్నారు. అయితే డీలర్ శ్రీనివాస్, వాహనం డ్రైవర్ మొగిలి వారిద్దరపై దురుసుగా ప్రవర్తించారు. మొగిలి అనే వ్యక్తిపైన ఇప్పటికే ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసినందుకు మూడు కేసులున్నాయి. దీంతో వారిద్దరు కలిసి డయల్ 100 కు ఫోన్ చేసి ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ఫిర్యాదు. చేశారు. దీంతో పోలీసులు వచ్చి టాటా మ్యాజిక్ వాహనాన్ని తాండూర్ పోలీసు స్టేషన్ తరలించారు. ఆదివారం ఉదయం తాండూర్ పోలీసులు తాళ్లపెల్లి భాస్కర్ గౌడ్, ఆదె శ్రీనును బియ్యం అక్రమ రవాణా కేసు విషయంలో సంతకం పెట్టటానికి పోలీసు స్టేషన్ రావాలని పిలిపించారు.
దీంతో వాళ్లిద్దరూ పోలీసు స్టేషన్ వెళ్లారు. అక్రమ రవాణా విషయంలో చర్యలు తీసుకోవాల్సిన తాండూరు పోలీసులు తిరిగి తమపై దురుసుగా ప్రవర్తించారని భాస్కర్ గౌడ్ వెల్లడించారు. డ్యూటీలో ఉన్న ఏ.ఎస్.ఐ. వాహనాలను ఆపి మీరు డబ్బులు తీసుకున్నారట..? అని అసభ్య పదజాలంతో దూషిస్తూ తమ ద్విచక్ర వాహనాల తాళాలు లాక్కున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మాపైన 4, 5 సెక్షన్ల కింద అక్రమ కేసులు పెడతానని ఏ.ఎస్.ఐ. బెదిరింపులకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని వారు మంచిర్యాల డీసీపీకి ఫిర్యాదు చేశారు.