మద్యం మత్తులో ఎస్ఐ వీరంగం
-నడిరోడ్డుపై స్నేహితులతో మందుతాగిన ఎస్ఐ
-పోలీస్ సిబ్బందిపైనే దాడికి యత్నం
శాంతిభద్రతలకు పరిరక్షించాల్సిన ఓ ఎస్ ఐ మద్యం మత్తులో అర్ధరాత్రి నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై స్నేహితులతో కలిసి మద్యం సేవించి హల్‌చల్ చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా బెజ్జంకి ఎస్సై తిరుపతి తన స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లికి వచ్చారు. మంగళవారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద స్నేహితులతో మద్యం సేవించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా, అక్కడ హంగామా సృష్టించాడు. దీంతో దీనిని గమనించిన స్థానికులు 100కు డయల్ చేశారు. ఈ సమాచారంతో బ్లూ కోర్ట్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు తిరుపతిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే ఎస్సై తిరుపతి బ్లూ కోర్ట్ పోలీస్ సిబ్బందిపై దాడి చేశాడు. స్థానికులు పోలీసులపై దాడిని అడ్డుకోవడంతో కారు వదిలి స్నేహితులతో కలిసి పరారయ్యాడు.