ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
బదిలీలతో పాటు, 9 వేల 266 మందికి ప్రమోషన్స్
Telangana: సంక్రాంతి పండుగ రోజు ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ శుభవార్త వినిపించింది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న బదిలీలు, ప్రమోషన్లకు ప్రభత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. చాలా రోజులుగా టీచర్ల బదిలీలు.. పదోన్నతులు జరగడం లేదు. దానిని ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాధికారులు సమావేశమయ్యారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయ నాయకులతో చర్చించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ నాయకులు తమ ఇబ్బందులు, సమస్యలతో పాటు పలు విజ్ఞప్తులు కూడా మంత్రులకు విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రులు.. ప్రధానంగా బదిలీలు, ప్రమోషన్లపై చర్చింది దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.
కొత్త జిల్లాలు ఏర్పాటైన నాటి నుంచి టీచర్ల బదిలీలపై అనేక తర్జన భర్జనలు జరిగాయి. చాలా కాలంగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న టీచర్లకు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఊరట కలిగించనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో కసరత్తు జరిగినట్లు గతంలోనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేజీబిబి,మోడల్ స్కూల్లోనూ బదిలీలు చేపట్టనున్నారు. కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా బదిలీల ప్రక్రియ నిర్వహించనున్నట్టు మంత్రులు తెలిపారు.