క్రీడలతో ఉత్తేజం, ఉల్లాసం
-తక్కువ సమయంలో మంచి ఏర్పాట్లు
-పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన సీపీ రెమా రాజేశ్వరి
-జవహర్ లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో సందడి
Ramagundam Police Commissionerate: క్రీడలతో ఉత్తేజంతో పాటు ఉల్లాసం కూడా కలుగుతుందని రామగుండం కమిషనర్ రెమారాజేశ్వరి స్పష్టం చేశారు. రామగుండం పోలీసు కమిషనరేట్ వార్షిక గేమ్స్,స్పోర్ట్స్ మీట్ పోటీలను గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రారంభమై ఆరేండ్లలో మొదటిగా నిర్వహించడం గర్వకారణమన్నారు. పోటీల గురించి చెప్పగానే తక్కువ సమయంలో ఘనంగా ఏర్పాటు చేసిన మంచిర్యాల పెద్దపల్లి డీసీపీలు, ఏసీపీలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. పోలీస్ విధి నిర్వహణలో ఎంతో కఠినమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ ఆటలతో శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటుందన్నారు. ఈ ఆటలపోటీలు అంటేనే పండుగ వాతావరణం అన్నారు. ఇక నుంచి ప్రతీ సంవత్సరం కమిషనరేట్ స్థాయిలో ఈ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ నిర్వహిస్తామన్నారు.
పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీ వైభవ్ గైక్వాడ్, సుధీర్ కేకన్ రాంనాథ్ మాట్లాడుతూ పోలీసులు శాంతిభద్రతల రక్షణలో నిత్యం బిజీగా ఉన్నా సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. ఆటల్లో గెలుపోటములనేవి సహజమన్నారు. గెలుపోటముల కంటే టీమ్ స్పిరిట్ గొప్పదన్నారు. క్రీడల్లో గెలుపు కంటే పాల్గొనడం ముఖ్యమన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్రం శాంతి భద్రతతో క్షేమంగా ఉందంటే అది పోలీసుల విధి నిర్వహణ వల్లే అన్నారు. ఇతర శాఖల వారికి సెలవు దినాలు ఉంటాయని, పోలీస్ సిబ్బందికి ఎలాంటి సెలవులు, పండుగలు ఉండవన్నారు. వారు ఎల్లప్పుడు విధినిర్వహణలో ఉంటారని తెలిపారు. అలాంటి పోలీసులకు ఈ ఆటలు ఎంతో ఉత్సాహం కలిగిస్తాయన్నారు.
మొదట కమిషనర్ రెమారాజేశ్వరి, మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్, డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సుధీర్ కేకన్ రాంనాథ్ శాంతి కపోతాలు, బెలూన్స్ ఎగురవేశారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఒలంపిక్ కాగడ చేత పట్టుకుని క్రీడాజ్యోతితో పరుగు తీశారు. తరువాత లాంఛనంగా క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు గిరి ప్రసాద్, ఎడ్ల మహేష్, నరేందర్, తిరుపతిరెడ్డి, మోహన్, వెంకటేశ్వర్లు, ఉపేందర్, ఏసీపీ బాల్రాజ్, సుందర్రావు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.