ఇక నుంచి ఆ తేదీల్లోనే శ్రీవారి టిక్కెట్ల విడుదల
Thirumala Thirupathi: తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం అంటే అద్భుతమే.. ఆనందదాయకమే.. ఆయన దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి చూస్తుంటారు. ఆయన దర్శనం, సేవ, అద్దె గదులకు సంబంధించిన టిక్కెట్ల కోసం భక్తులు నిత్యం ఎదురుచూస్తుంటారు. కానీ, ఇక నుంచి ఆ పని లేదు. ప్రతి నెలా షెడ్యూల్ ప్రకారం ఈ టిక్కెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది భక్తులు వెళ్తుంటారు. తిరుమల వెళ్లేవారు ఒకటి రెండు నెలలు ముందుగానే సన్నద్ధమవుతుంటారు. దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారా? అద్దె గదుల కోటా ఎప్పుడు ప్రకటిస్తారా? అని ఎదురుచూస్తుంటారు. గతంలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ టిక్కెట్లు విడుదల చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా దర్శనం, ఆర్జితసేవలు, గదుల కోటా ఆన్లైన్లో షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించిన క్యాలెండర్ను టీటీడీ విడుదల చేసింది. టికెట్లు, సేవలు, వసతి విషయంలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రతి నెలా 18 నుంచి 20 వరకు ఆర్జిత సేవా టికెట్లను లక్కీడిప్ ద్వారా భక్తులు నమోదు చేసుకోవచ్చు. ఆయా సేవలకు ఎంపికైన భక్తులు 20 నుంచి 22 వరకు డబ్బులు చెల్లిస్తే టికెట్లు ఖరారవుతాయి. 21న వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లు, 23న శ్రీవాణి ట్రస్ట్, అంగప్రదక్షిణ, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు, 24న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. వసతి టికెట్లు ప్రతి నెలా 25న తిరుమల, తిరుపతితో పాటు తలకోనకు సంబంధించిన వసతి గదుల కోటా ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.