సింగరేణి కార్మికుల కష్టాలు పట్టవా..?
-వారి భద్రత యాజమాన్యం గాలికి వదిలేసింది
-శ్రీరాంపూర్ సిహెచ్ పి డీజిఎం కక్ష సాధింపు చర్యలు
-బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు ఆగ్రహం
SingareniL మండుటెండల్లో పనిచేస్తున్న కార్మికుల గురించి యాజమాన్యం కనీసం పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవికాలంలో తాగడానికి నీళ్లు, మజ్జిగ లేదని, భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్మికులతో పనిచేయిస్తున్నారని, వారి భద్రత పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. శ్రీరాంపూర్ డివిజన్లో సీహెచ్‌పీ కార్మికులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం బీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు కనీస వసతులు ఏర్పాటు చేయడంలో యాజమాన్యం విఫలమైందన్నారు.
మరోవైపు ఎవరైనా కార్మికులు ప్రశ్నిస్తే వారిని వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రశ్నించిన కార్మికులను లక్ష్యంగా చేసుకుని షిఫ్ట్‌లు మార్చడం, బదిలీ చేయడం ఇక్కడ అధికారులకు అలవాటుగా మారిందన్నారు. శ్రీరాంపూర్ సిహెచ్ పి డీజిఎం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని, ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు పేరంరమేష్, జాడిఈశ్వర్, కడాసుభీమయ్య, జోగులప్రభాకర్, రాకేష్, తౌటంభాస్కర్, సురేష్, సత్యం పాల్గొన్నారు.