జోరుగా నైరుతి రుతుపవనాలు
-ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల కురుస్తున్న వానలు
-రేపటి నుంచి తెలంగాణకు వర్ష సూచన
-చల్లని కబురు అందించిన వాతావరణశాఖ
Monsoon: మొత్తానికి నైరుతి రుతుపవనాల జోరు పెరిగింది. బుధవారం ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరిస్తున్న రుతుపవనాలు.. గురువారం తెలంగాణను తాకబోతున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రల్లో విరివిరిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ నెల 21 లేదా 22న తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయి అని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. తాజా అంచనా ప్రకారం.. బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయాన్నే రుతుపవనాలు తెలంగాణను తాకనున్నాయి. రుతుపవనాలు ముందుగా దక్షిణ తెలంగాణను తాకుతాయి. అంటే… నల్గొండ, గద్వాల సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాల్లోకి ముందుగా వస్తాయి. అందువల్ల గురువారం నుంచి తెలంగాణలో 3 రోజులపాటూ తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోకి వచ్చే రుతుపవనాలు… జూన్ 26 నాటికి రాష్ట్రమంతటా విస్తరించనున్నాయని అధికారులు స్పష్టం చేశారు. అప్పటివరకూ తెలంగాణలో పలు చోట్ల ఎండల తీవ్రత ఉంటుందని వెల్లడించారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో బుధవారం, గురువారం అక్కడక్కడా భారీవర్షాలు పడనున్నాయి. మిగిలినచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, తొందరపడి రైతులు విత్తనాలు ముందుగానే విత్తుకోవద్దని మరోమారు అధికారులు చెబుతున్నారు.