రూ. 5 వేలకే తిరుపతి టూర్.. శ్రీవారి దర్శనం
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లాలనుకునేవారికి ఐటీఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ‘సప్తగిరి’ పేరుతో అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది.
కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు ఐఆర్సీటీసీ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ రైలు, రోడ్డు మార్గం ద్వారా కొనసాగుతుంది. ప్రతీ గురువారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. టూర్ మొదటి రోజు కరీంనగర్లో ప్రారంభమవుతుంది. ఈ రైలు రాత్రి 7.15 గంటలకు కరీంనగర్లో, రాత్రి 8.05 గంటలకు పెద్దపల్లిలో, రాత్రి 9.15 గంటలకు వరంగల్‌లో, రాత్రి 11 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. రెండో రోజు ఉదయం 7.50 గంటలకు రైలు తిరుపతి చేరుకుంటుంది. ఐఆర్సీటీసీ సిబ్బంది పర్యాటకుల్ని రిసీవ్ చేసుకొని అక్కడ్నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు. ప్రెషప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలు చూపిస్తారు. తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల సందర్శన ఉంటుంది. పర్యాటకులు రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు.
మూడో రోజు ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. దర్శనం పూర్తైన తర్వాత తిరుపతికి బయల్దేరాలి. రాత్రి 8.15 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. ఈ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4970, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4990, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.6290 చెల్లించాలి. కంఫర్ట్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6870, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6890, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.8190 చెల్లించాలి.