ఆ మంత్రికి అగ్ని పరీక్షే
ఇటు ఎమ్మెల్సీ ఎన్నిక.. అటు పదవీ గండం
అటు స్థానిక సంస్థల ఎన్నిక, ఇటు కొత్తగా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలతో ఆ మంత్రికి పదవీ గండం పొంచి ఉందా..? ఆయనకు చెక్ పెట్టేందుకు అధినేత వ్యూహం సిద్ధం చేశారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు రకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అంత సజావుగా జరిగేలా కనిపించడం లేదు. ఇక్కడ అధికార పార్టీకి బలం ఉన్నప్పటికీ పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని దుస్థితి. అసమ్మతి నేతలు, తమకు అధికారాలు ఇవ్వలేదని అలిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఎక్కడ పుట్టి ముంచుతారో అనే ఆందోళన ఉంది. వీరంతా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేస్తుననారు. అయినా ప్రభుత్వం వీరిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. నామినేషన్లు కూడా పెద్ద సంఖ్యలో వేసి తమ సత్తా చూపించాలని నిర్ణయం తీసుకున్నారు. వీరందరినీ సముదాయించేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యత మంత్రిదే కావడంతో ఆయనకు ఇది తలనొప్పిగా మారనుంది. అందరూ దారికి వస్తారా..? లేక మంత్రికి తలనొప్పులు తప్పవా..? అనేది రెండు రోజుల్లో తేలనుంది.
వారికి ఇస్తే ఈయనకు పదవీ గండమే..
కొత్తగా వచ్చే ఎమ్మెల్సీల్లో సామాజిక నేపథ్య పరంగా రెడ్డిలకు ఎవరికైనా పదవి ఇస్తే అది ఖచ్చితంగా ఇంద్రకరణ్‌రెడ్డికి ఎసరు పెట్టేందుకే. బండా ప్రకాష్‌కు రాజసభ పదవీ కాలం రెండేళ్లు ఉన్నప్పటికీ ఆయనను వెనక్కి పిలిపించారు. ఈటెల రాజేందర్ స్థానం భర్తీ చేసేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కేసీఆర్ ఎంపిక చేసుకున్నారు. ఆయనకు ఖచ్చితంగా పదవి గ్యారంటీ. అయితే ఉన్న దాంట్లో శాఖలు మారుస్తారు తప్ప ఇతర మంత్రుల పదవులు పోవు. గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కారణంగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి పదవి పోతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాననే హామీ మేరకే ఎమ్మెల్సీగా చేసినట్లు సమాచారం. మరోవైపు కలెక్టర్ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన వెంకట్రామిరెడ్డికి కూడా మంత్రి పదవి కేసీఆర్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. వీళ్ల సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇంద్రకరణ్ రెడ్డిపై వేటు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి మల్లారెడ్డికి చెక్ పెడితే ఇంద్రకరణ్ రెడ్డి సేఫ్ జోన్‌లో ఉంటారు.