కారెక్కేందుకు కమ్యూనిస్టులు సిద్ధం
సీపీఐ, సీపీఎం జాతీయ నేతలకు కేసీఆర్ విందు - పొత్తులపై నేతల మంతనాలు
హైదరాబాద్ : కారెక్కేందుకు కమ్యూనిస్టులు సిద్ధం అయ్యారు. బీజేపీపై పోరులో కమ్యూనిస్టులతో కలిసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కలుస్తారా..? బీజేపీపై పోరులో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ యత్నాలకు కేసీఆర్ మరింత పదును పెడుతున్నారు. హైదరాబాద్‌లో నిన్న జరిగిన పరిణామాల పూర్తి సారాంశం ఇదీ…
సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు శనివారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో వీరి భేటీకి ఎనలేని ప్రాధాన్యం లభించింది. మూడు రోజులపాటు జరుగనున్న పార్టీ జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన జాతీయ నేతలను గులాబీ బాస్ కేసీఆర్ విందుకు పిలిచారు. అనుబంధ సంఘం అఖిల భారత యువజన సమాఖ్యలో పాల్గొనేందుకు సీపీఐ జాతీయ నేతలు సైతం నగరానికి రాగా, వారికి కూడా ఆహ్వానించారు కేసీఆర్. సీపీఐ, సీపీఎం నేతల బృందాలు వేర్వేరుగా కేసీఆర్ ను కలిశాయి.
కేసీఆర్ ను కలిసిన సీపీఎం బృందంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, సీపీఎం సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిళ్లై, బాలకృష్ణన్, ఎంఏ బాబీ తదితరులతోపాటు తెలంగాణ శాఖ నేతలు కూడా ఉన్నారు.
ప్రగతి భవన్ విందుకు విచ్చేసిన సీపీఐ నేతల బృందంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేరళ ఎంపీ బినయ్ విశ్వం, కేరళ రెవెన్యూ మంత్రి రాజన్, తెలంగాణ సీపీఐ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు తదితరులున్నారు.
సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు వేర్వేరు కారణాలతో పార్టీ పనుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన సందర్బంగా వారిని సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా ప్రగతిభవన్‌కు ఆహ్వనించి, విందు ఏర్పాటు చేశారు. శుక్రవారమే కేసీఆర్‌తో సీపీఎం నేతలు భేటీ కావాల్సి ఉంది. అనివార్యకారణాలతో భేటీ వాయిదా పడింది. మొత్తానికి ఉభయ కమ్యూనిస్టు కీలక నేతలు శనివారం గులాబీ బాస్ తో భేటీ అయ్యారు.
విందు అనంతరం సీపీఎం నేతలతో గంటన్నరపాటు కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు సీఎంలు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. దేశంలో బీజేపీని ఎలా నిలువరించాలనే అంశంపైనే కేసీఆర్, కమ్యూనిస్టు పెద్దలు సమాలోచనలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం పెరిగిన నేపథ్యం, టీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనే రీతిలో కమలం పార్టీ దూకుడు ప్రదర్శిస్తోన్న నేపథ్యంలోనే కాషాయదళాన్ని నిలువరించేందుకు కొత్త ఎత్తులు, పొత్తులతో కేసీఆర్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అందులోభాగంగానే కమ్యూనిస్ట్ నేతలతో భేటీ అయినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీని నిలువరించే దిశగా కమ్యూనిస్టు పార్టీలకు స్నేహ హస్తం అందించేందుకు గులాబీ బాస్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ కమ్యూనిస్టులతో కలిసి పనిచేసిన చరిత్ర టీఆర్ఎస్ కు ఉంది. తెలంగాణ ఏర్పడ్డ చాలా కాలానికి ఇటీవల మళ్లీ ఆ మూడు పార్టీలు దగ్గరవుతూ, పలు స్థానిక ఎన్నికల్లో పరస్పరం సహకరించుకున్నాయి.
రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటానికి కమ్యూనిస్టు పార్టీలు తోడైతే తమకు అదనపు బలవుతుందని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కోసం ప్రయత్నిస్తోన్న కేసీఆర్ గతంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎం మమత బెనర్జీ, సీఎం స్టాలిన్‌ను కలిశారు. ఆ ప్రక్రియకు మధ్యలో బ్రేకులు పడింది. ఇప్పుడు మళ్లీ ఆ దిశగా కేసిఆర్ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీఎంకు కేసీఆర్ స్నేహహస్తం అందిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.