తెలంగాణ ప్రజా జాగృతి…. క‌విత కొత్త పార్టీ ఇదే..

Kalvakuntla Kavitha:తాను త‌ర్వ‌లో కొత్త పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన కల్వకుంట్ల క‌విత‌(Kalvakuntla Kavitha)… ‘తెలంగాణ ప్రజా జాగృతి’ (Telangana Praja Jagruthi) పేరుతో రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారు. ఆ దిశ‌గా అడుగులు ముమ్మ‌రం చేశారు. ఈ నేపథ్యంలోనే తన నూతన పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని పేరు ఖరారు చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇప్పుడు సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ (TPJ) పేరుతో ఆమె కొత్త రాజకీయ పార్టీని స్థాపించ‌నున్నారు. ఈ మేరకు పార్టీ నమోదు ప్రక్రియ కవిత ప్రారంభించారు. జనవరి 23న ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీ నమోదు కోసం ఈసీఐకి దరఖాస్తు చేశారు కవిత. ఫిబ్రవరి 23న దరఖాస్తులో సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ ఈసీఐ తిరుగు టపా పంపింది. మార్చి 19న దిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్‌పై కీలక విచారణ జరగనుంది. ఈ న్యాయపోరాటం ద్వారా పార్టీని సాధ్యమైనంత త్వరగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

పార్టీ నమోదు విషయంలో ఈసీఐ లేవనెత్తిన లోపాలు ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారాయి. రాజకీయ పార్టీ నమోదుకు ఉండాల్సిన నిబంధనలు (Section 29A of RP Act) చాలా కఠినంగా ఉంటాయి. నిధుల సమీకరణ, పార్టీ రాజ్యాంగం, సభ్యత్వ వివరాల్లో స్పష్టత ఉండాలి. గతంలో ‘తెలంగాణ జాగృతి’ ద్వారా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఆమె.. ఇప్పుడు దాదాపు అదే పేరును రాజకీయ పార్టీగా మార్చడం వెనుక సెంటిమెంట్, బ్రాండ్ వాల్యూ రెండూ ఉన్నాయని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి ప్రాతిపదికన తన రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలనేది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది.

కొత్త పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని పేరు ఖరారు చేసిన క‌విత‌…. పసుపు, ఎరుపు రంగుల్లో పార్టీ జెండా రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ వెంట బీసీ ఓటు బ్యాంక్ ఉండేది. ఆ ఓటు బ్యాంక్ ను తనవైపు తిప్పుకునేలా పసుపు టచ్ ఇస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో నడుస్తున్న చర్చ. మ‌రోవైపు సింగ‌రేణిలో సైతం ఆమెకు ప‌ట్టుంది. దానికి సంబంధించి క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

You might also like