బీజేపీ అంటే గ‌జ‌గ‌జ‌

-క‌ల్వ‌కుంట్ల రాజ్యాంగం అమ‌లు చేయాల‌న‌కుంటున్న‌రు
-కేసీఆర్ న‌శం పెడితే మేం జండూబామ్ పెడతాం
-త్వరలోనే జనగామలో బహిరంగ సభ
-ముఖ్య‌మంత్రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన బండి సంజ‌య్

హైదరాబాద్: కేసీఆర్ నశం పెడితే మేము జండూబామ్ పెడుతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జనగామ సభలో సీఎం కేసీఆర్ బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. శనివారం బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి అయి ఉండి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమ‌లు చేయాల‌నుకునే భ్ర‌మ‌లో ఉన్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలో, అంబేద్కర్ రాజ్యాంగం కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలన్నారు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. జనగామలో కేసీఆర్ ఎందుకు బహిరంగ సభ పెట్టారో అర్ధం కావడం లేదన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడతామని కేంద్రం ఎప్పుడు చెప్పిందని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి అని.. ఢిల్లీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు.

సభ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను దౌర్జన్యంగా అరెస్ట్ చేశారన్నారు. సీఎం సభకు రెండ్రోజుల ముందు నుండే కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లో పెట్టారన్నారు. పోలీసుల సమక్షంలో దాడులు చేయిస్తున్నరని.. బీజేపీ కార్యకర్తలు లాఠీలకు, దాడులకు భయపడకుండా బయటకొచ్చి భారతమాతాకీ జై అంటూ జెండా పట్టుకుని వస్తున్నారన్నారు. తెలంగాణలో పాలన ఇలాగే కొనసాగితే…. నిజాం పాలన మాదిరిగా కేసీఆర్ వస్తుంటే… చెప్పులు చేతుల్లో పట్టుకుని వంగి వంగి దండాలు పెట్టాలేమో? అన్నారు. సీఎం సభ పెడితే ప్రభుత్వం చేసిన పనులు చెప్పాలని..డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భృతి ఎంత మందికి ఇచ్చావో చెప్పాలన్నారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి కానీ..బీజేపీపై మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు అంటే కేసీఆర్ ఫ్యామీలికి గజగజ అన్నారు.

నోరు తెరిస్తే మందువాసన వచ్చే కేసీఆర్ ను పక్కాగా సభలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేపిస్తం అన్నారు. తాగినట్లు తేలితే… జైలుకు పంపుతామని.. ఆ స్కీం కేసీఆర్ కోసం కచ్చితంగా తీసుకొస్తా అన్నారు. కేసీఆర్ అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందని.. అందుకే మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నాడని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. బీజేపీ పిడికెడు అని కామెంట్ చేసిన కేసీఆర్ ఎందుకు అలా భయపడుతున్నారని నిలదీశారు. త్వరలోనే జనగామలో బహిరంగ సభ పెట్టి టీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like