రూ. 1,000 కోట్లతో శాశ్వత కాలనీలు

-వ‌ర‌ద బాధితుల‌కు రూ. 10 వేల ఆర్థిక సాయం
-క్లౌడ్ బ‌ర‌స్ట్ జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌నే అనుమానాలు
-ప్ర‌మాదం తొల‌గిపోలేదు.. అప్ర‌మ‌త్తంగా ఉండాలి
-గంగ‌మ్మ‌కు శాంతి పూజ‌లు చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

రూ. 1000 కోట్లతో వరద బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అదే విధంగా భద్రాచలం వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం, 20 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వరద ప్రభావానికి గురైన గ్రామాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ చూడని వరద వచ్చిందని, కడెం ప్రాజెక్టు పరిస్థితి ఇందుకు ఉదాహరణ అని అన్నారు. 29వ తేదీ వరకు ప్రతిరోజు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిందని, అందుకే బాధితులు అప్పటి వరకు సహాయక శిబిరాల్లానే ఉండాలని సూచించారు. ప్రమాదం ఇంకా తొలగిపోలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

వరదలు వచ్చినప్పుడల్లా భద్రాచలం వాసులు ముంపునకు గురికావడం బాధాకరమని కేసీఆర్ అన్నారు. శాశ్వత కాలనీల నిర్మాణం కోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద వచ్చినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నందుకు సీఎం అభినందించారు. ఇతర దేశాలకు చెందిన వారు మన దేశంలో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉందన్నారు. దీని వెనుక వీదేశీ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. క్లోడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చిందని చెబుతున్నారన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.

వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. వచ్చే రెండు నెల‌లు ప్రతి కుటుంబానికి 20 కిలోల బియ్యం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. సుభాష్ నగర్, ఎఎంసీ కాలనీలు, కొత్త కాలనీల వాసులను ఇక్కడి నుండి తరలించాలని సీఎం కోరారు. వీరి కోసం వెయ్యి కోట్లతో శాశ్వతంగా భవనాలు నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ విషయమై సీఎస్ సోమేష్ కుమార్ చర్యలు తీసుకొంటారని చెప్పారు. పినపాక, భద్రాచలం ప్రాంతాల్లో శాశ్వత కాలనీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. అంటు వ్యాధులు వ్యాపించకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like