13 ల‌క్ష‌ల ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తి న‌ష్టం

-రోజుకు 1.60లక్షల టన్నుల ఉత్పత్తికి బ్రేక్
-సింగ‌రేణి ఓపెన్‌కాస్టుల్లో పూర్తిగా నిలిచిన ఉత్ప‌త్తి
-అండ‌ర్ గ్రౌండ్ గ‌నుల్లో పెంచేందుకు చ‌ర్య‌లు

మంచిర్యాల : వారం రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల సింగ‌రేణిలో ఉత్ప‌త్తికి భారీగా గండి ప‌డింది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా జులైలోనే భారీగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓపెన్‌కాస్టుల్లో నీరు నిలిచి బొగ్గు ఉత్ప‌త్తి జ‌ర‌గ‌డం లేదు. అన్ని ఓపెన్​కాస్ట్​ గనుల్లో బొగ్గు వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. సింగ‌రేణి వ్యాప్తంగా 10 ల‌క్ష‌ల ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తికి న‌ష్టం జ‌రిగిన‌ట్లు యాజ‌మాన్యం స్ప‌ష్టం చేసింది.

సింగ‌రేణి వ్యాప్తంగా ఉన్న ఆరు జిల్లాలో భారీగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. మ‌రోవైపు సింగ‌రేణి మొత్తం గోదావ‌రి తీరానికి ఆనుకుని ఉంటుంది. మంచిర్యాల,అసిఫాబాద్​,పెద్దపల్లి,భూపాలపల్లి,భద్రాదికొత్తగూడెం,ఖమ్మం జిల్లాల్లో మొత్తం 19 ఓపెన్​కాస్ట్​ గనుల ఉంటాయి. ప్ర‌తి రోజు 1.63 ల‌క్ష‌ల ట‌న్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఉత్ప‌త్తిలో ఓపెన్ కాస్టుల్లోనే అత్య‌ధికంగా ఉత్ప‌త్తి సాగుతుంది. అన్ని ఓపెన్‌కాస్టుల్లో ప‌నులు నిలిచిపోవ‌డంతో సుమారు 13లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. దీంతో పాటు రోజుకు 13లక్షల క్యూబిక్​ మీటర్ల ఓవర్​ బర్డెన్ పనులు ఆగిపోయాయి.

ఉప‌రిత‌ల గ‌నుల్లో ఉత్ప‌త్తికి విఘాతం క‌లుగుతున్న నేప‌థ్యంలో భూ గ‌ర్భ గ‌నుల నుంచి అధికోత్ప‌త్తిని సాధించాల‌ని సింగ‌రేణి యాజ‌మాన్యం భావిస్తోంది. ఈ మేర‌కు సోమ‌వారం డైరెక్ట‌ర్లు ఆయా ఏరియాల జీఎంల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. భూగ‌ర్భగ‌నుల్లో 100 శాతం ల‌క్ష్యాలు సాధించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాల‌ని సూచించారు. ఎస్‌డీఎల్ యంత్రాలు స‌గ‌టున రోజుకు 150 ట‌న్నుల ఉత్ప‌త్తి సాధించేలా చూడాల‌ని కోరారు. అవ‌స‌ర‌మైన కార్మికుల‌ను ఉత్ప‌త్తిలో వినియోగించుకోవ‌డానికి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. బొగ్గు ర‌వాణాకు ట‌బ్బుల కొర‌త లేకుండా చూసుకోవాల‌ని సూచించారు. భూ గ‌ర్భ గ‌నుల్లో కార్మికుల గైర్హాజ‌రు త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like