ఈ నెల 18నే వినాయక చవితి

Vinayaka chavithi: వినాయక చవితి ఏ తేదీన నిర్వహించాలనే దానిపై సందిగ్ధం ఏర్పడింది. దీనిపై తెలంగాణ విద్వత్సభ, భాగ్య‌న‌గ‌ర ఉత్స‌వ క‌మిటీ, కాణిపాకం ఆల‌య అర్చ‌కులు సైతం ఈ నెల 18నే వినాయ‌క చ‌వితి జ‌రుపుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.

అధిక శ్రావణమాసం రావడంతో ఈ ఏడాది పండగలన్నీ లేట్ అవుతున్నాయి. దానికి తోడు తిథులు అటూ ఇటూ అవుతుండటంతో పండగ ఏరోజు అనే సందిగ్దత ఏర్పడుతోంది. ఈ నెలలో రాబోతున్న వినాయక చవితి విషయంలోనూ ఇదే సందేహం. ఈనెల 18వ తేదీన వినాయక చవితి నిర్వహించుకోవాలని కొందరు.. లేదు లేదు 19వ తేదీయే కరెక్ట్ అంటున్నారు మరికొందరు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ విద్వ‌త్స‌భ‌, భాగ్యన‌గ‌ర ఉత్స‌వ క‌మిటీ, కాణిపాకం ఆల‌య అర్చ‌కులు దానిపై పూర్తి స్థాయిలో స్ప‌ష్ట‌త ఇచ్చారు.

వినాయక చవితి ఈ నెల 18వ తేదీనే నిర్వ‌హించాల‌ని తెలంగాణ విద్వత్సభ గౌరవ సలహాదారు ఆకెళ్ళ జయకృష్ణ శర్మ సిద్ధాంతి వెల్ల‌డించారు. ఈ సంవత్సరం శ్రీ శోభకృత్ నామ సంవత్సర భాద్రపద శు ౹౹ తృతీయ సోమవారం 18 – 09 – 2023 రోజున వినాయక చవితి పండుగ తెలంగాణలో అందరూ జరుపుకోవాలని తెలంగాణ విద్వత్ సభలో సుమారు వంద మంది పండితులందరూ ఏకముఖముగా నిర్ణయించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. చవితి తిథి 18వ తేదీనే ఉంది కాబట్టి అదే జరుపుకోవాలని నిర్ణయించామన్నారు.

ఈ విష‌యంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సైతం ఒక ప్రకటన చేసింది. ఈ నెల 18వ తేదీనే వినాయకచవితి పండుగని పేర్కొంది. అలాగే 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని స్ప‌ష్టం చేసింది. అయితే, అంతకు ముందు 19న వినాయక చవితి, 29న నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించిన సంగతి విదితమే. అయితే.. ఈ ఏడాది తిథి రెండు రోజులు ఉండడం వల్ల.. పండుగ ఎప్పుడనే దానిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. శృంగేరి కంచి పీఠాధిపతులు గణేష్ ప్రతి 18వ తేదీనే చేసుకోవాలని సూచించారట. కాబట్టి.. గ్రేటర్ పరిధిలోని మండపాలు 18వ తేదీనే వినాయక చవితి నిర్వహించుకోవాలని సూచించింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ.

వినాయక చవితి పండగ జరుపుకునే తేదీపై కాణిపాకం ఆలయం అర్చకులు సైతం క్లారిటీ ఇచ్చారు. ఈనెల 18వ తేదీన వినాయకచవితి నిర్వహించుకోవాలని తేల్చి చెప్పారు. భాద్రపద శుద్ధ చవితి తేదీ 18-9-2023 సోమవారం ఉదయం 10.15 నిమిషాలు నుంచి మరుసటి రోజు ఉదయం 10.43 నిమిషాలు వరకూ ఉంటుంది.. అంటే 18-9-2023 రోజు రాత్రి మాత్రమే చవితి తిథి ఉంది. కాబట్టి కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ప్రధాన వేద పండితులు సుబ్బారావు శర్మ చెప్పారు. 18వ తేదీ నుంచి 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like