26 ఏళ్ల వయసు.. 21 పెళ్లిళ్లు..

21 marriages at the age of 26: ఇప్పుడున్న కాలంలో అసలు యువకులకు అమ్మాయిలు దొరకటమే కష్టంగా మారింది.. ఈ రోజుల్లో ఒక్క పెండ్లి చేసుకోవాలంటేనే త‌ల ప్రాణం తొక‌కు వ‌స్తోంది. చాలా మంది యవకులు 35 నుంచి 40 ఏళ్లకు చేరుకున్నా పెళ్లిళ్లు కాక నానా కష్టాలు పడుతున్నారు. మ‌రికొంత‌మంది పెండ్లికాని ప్ర‌సాదుల్లా మిగిలిపోతున్నారు.. కానీ, ఓ యువ‌కుడు ఏకంగా 21 పెండ్లిడ్లు చేసుకున్నాడు.. అది కూడా 26 ఏండ్ల వ‌య‌సులో..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్నాడో నిత్య పెళ్లి కొడుకు. అది కూడా కేవలం 26 ఏళ్ల వయసులోనే. ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని కట్నం డబ్బులు ఖ‌ర్చులు చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఈ నిత్య పెళ్లి కొడుకు 21వ వివాహానికి అడ్డంగా దొరికిపోయాడు. అయితే.. ఇన్ని పెళ్లిళ్లు ఎలా చేసుకున్నాడనేదే.. ఇప్పుడు అందరినీ తొలిచేస్తోన్న ప్రశ్న.

తమిళనాడు రాష్ట్రం తంజావూర్ జిల్లా రామనపూడికి చెందిన కార్తీక్ రాజా.. ఈ ఏడాది మార్చి నెలలో రాణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిలో అమ్మాయి తరఫు వాళ్లు కట్నంగా ఐదెకరాల భూమి, బంగారంతో పాటు లక్షన్నర నగదు ఇచ్చారు. ఇచ్చిన కట్నాన్ని మొత్తం తీసుకుని కార్తీక్ జంపయ్యాడు. కట్టుకున్న భర్త, ఇచ్చిన కట్నం.. కనిపించకపోయేసరికి భార్య రాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కార్తీక్ ఎక్కడున్నాడో కనుక్కున్నారు. ఆయ‌న‌ను విచారించిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. కార్తీక్ రాజాకు రాణితో సహా ఇప్పటి వరకు 21 పెళ్లిళ్లు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

కార్తీక్ రాజా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి.. డబ్బులు సంపాదించేందకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పెద్ద ఉద్యోగం చేస్తున్న‌ట్లు బిల్డ‌ప్ ఇవ్వ‌డం… పెళ్లి చేసుకున్నాక ఆ కట్నంతో ఎంజాయి చేయొచ్చు అన్నది కార్తీక్ రాజా ప్లాన్. ఇదే ప్లాన్ ప్రకారం.. ఒక్కో అమ్మాయికి ఒక్కో పేరుతో పరిచయమై వరుసగా వివాహాలు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే.. పెళ్లయ్యాకా ఒక్క భార్యతోనూ కనీసం 5 నెలలు కూడా ఉండేవాడు కాదు. ఓ పెళ్లి జరిగిన తర్వాత ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి.. అన్నీ అయిపోయాక మరో ఊరికి వెళ్లి ఇంకో అమ్మాయితో వివాహం చేసుకునేవాడని పోలీసులు వెల్లడించారు. కార్తీక్ రాజా తమిళనాడులోని మొత్తం 13 జిల్లాల్లో ఈ పెళ్లిళ్ల పర్వానికి తెరలేపినట్టు గుర్తించారు.

అయితే.. కార్తీక్ రాజా విషయం వెలుగు చూడటంతో అంతకుముందు పెళ్లి చేసుకున్న 20 మంది భార్యలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. నిత్య పెళ్లికొడుకు కార్తిక్ రాజా వద్ద ప్రస్తుతం ఓ ఆడి కారు మాత్రమే ఉందని.. బంగారం, నగదు లాంటివి ఏమీ లేవని పోలీసులు గుర్తించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like