30 శాతం అద‌నంగా కొన్నాం

స‌మీక్షా స‌మావేశంలో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్

హైదరాబాద్ : తెలంగాణలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేసారు. గత ఏడాది కంటే 30శాతం అధికంగా ధాన్యం సేకరణ చేసామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వానికి నిధుల కొరత లేనేలేదని తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో గత సంవత్సరం ఇదే రోజు కన్నా దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఏడు అధికంగా కొనుగోలు చేసామని తెలిపారు. ఇప్పటికే పదమూడు జిల్లాల్లో 1280 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయి మూసివేసామన్నారు. రూ.5447 కోట్లను ఇప్పటికే రైతుల అకౌంట్లలో వేశామన్నారు. ఓపీఎంఎస్ లో నమోదైన వెంటనే రైతుల అకౌంట్లలో నిధుల్ని జమచేస్తున్నామని మంత్రి స్పష్టం చేసారు. ఇప్పటివరకు 6775 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేపడుతున్నామని వెల్లడించారు. నిన్నటి(ఆదివారంఏ వరకూ 42.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసామని, వీటి విలువ రూ.8268 కోట్లు వుంటుందన్నారు. ఒపీఎంఎస్ లో నమోదైన 4 లక్షల 50వేల మంది రైతుల్లో 3 లక్షల 75వేల మందికి పేమెంట్ సైతం పూర్తి చేసామన్నారు.

రాష్ట్రంలో ట్రాన్స్ పోర్టు, గన్నీల కొరత లేదన్నారు. కరోనా సంక్షోభంలోనూ వానాకాలం వడ్ల కొనుగోళ్లు నిరంతరాయంగా చేస్తున్నామన్నారు మంత్రి గంగుల. ఎఫ్.సి.ఐ గోదాములు తెలంగాణలో దాదాపుగా అన్నీ నిండిపోయాయన్నారు. మిగతా చోట్ల సైతం ధాన్యం నిలువ విష‌యంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎఫ్.సి.ఐ గోదాములను, గోడౌన్లను లీజుకు తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు దీనికి తోడు సరైన సమయానికి ర్యాక్ లు పంపకపోవడంతో గోదాముల నుండి బియ్యం తరలింపు జరగడం లేదన్నారు. దీంతో మిల్లుల్లో ఉన్న బియ్యాన్ని ఎఫ్.సి.ఐ గోదాముల్లోకి తీసుకోలేకపోతుందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి , ఎఫ్.సి.ఐ కు విజ్ణాపన లేఖలు పంపిందని… అయినా ఎలాంటి స్పందనా లేదన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం వానాకాలం ధాన్యం సేకరణను వేగవంతంగా చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని మంత్రి గంగుల స్పష్టం చేసారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like