పాలు ఇవ్వడం లేదని గేదెపై ఫిర్యాదు
ఫిర్యాదు స్వీకరించి సమస్యను పరిష్కరించిన అధికారులు ..
అప్పటి వరకూ రోజుకు సుమారు 5 లీటర్ల పాలు ఇచ్చే గేదె.. అకస్మాత్తుగా మానేయడంతో ఆ రైతు కంగుతిన్నాడు. సమస్యకు పరిష్కారం కోరుతూ చుట్టుపక్కల వారిని అడిగితే.. వారు అతడిని ఆటపట్టించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో ఆ రైతు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో అతడిని నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఆ రైతు సమస్యను పరిష్కరించారు. పోలీసులు ఏంటి.. ఈ విచిత్ర కేసును పరిష్కరించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాకు చెందిన బాబూరామ్ అనే వ్యక్తి తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ సభ్యులను పోషించుకుంటున్నాడు. ఆయనకు ఓ గేదె కూడా ఉంది. ఆ గేదె కొద్దిరోజుల క్రితమే దూడకు జన్మనిచ్చింది. దీంతో బాబూరామ్ రోజూ సుమారు ఐదు లీటర్ల పాలను ఆ గేదె నుంచి సేకరించేవాడు. అయితే శుభకార్యం నిమిత్తం రెండు రోజులపాటు పక్కన ఉన్న ఊరికి వెళ్లొచ్చే సరికి.. అకస్మాత్తుగా గేదె పాలు ఇవ్వడం మానేసింది. దీంతో ఒక్కసారిగా బాబూరామ్ కంగుతిన్నాడు. చుట్టుపక్కల వారికి సమస్యను చెప్పి, పరిష్కారం అడిగాడు. అయితే వారు.. అతడిని ఆటపట్టించే ఉద్దేశంతో పోలీసులను ఆశ్రయించమని సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే బాబూరామ్ పోలీసుల స్టేషన్‌కు వెళ్లాడు.
అంతేకాకుండా.. ‘సర్ నా గేదె ఇంతకుముందు 5 లీటర్ల పాలిచ్చేది. ఇప్పుడు పాలివ్వడం లేదు. దయచేసి సహాయం చేయండి’ అంటూ అభ్యర్థించాడు. దీంతో అతడి సమస్యను విని.. తొలుత పోలీసులు నవ్వారు. అంతేకాకుండా అతడిని స్టేషన్ నుంచి పంపించేశారు. ఈ క్రమంలో బాబూరామ్.. శనివారం రోజు ఉదయం గేదెతో సహా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న ఎస్సై.. బాబూరామ్ అమాయకత్వాన్ని అర్థం చేసుకుని, అతడి నుంచి ఫిర్యాదు స్వీకరించాడు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న పశువైద్యుడిని పిలిపించాడు. ఈ క్రమంలో సదరు పశువైద్యుడు.. పాలు పితికే సమయంలో పాటించాల్సిన కొన్ని మెళకువలను బాబూరామ్‌కు నేర్పించాడు. దీంతో అతడి సమస్యకు పరిష్కారం దొరికింది.