మళ్లీ రోడ్డెక్కిన ఇథనాలు రైతులు
farmers are on the road again : తమ భూముల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు వ్యతిరేకంగా దిలావర్ పూర్ రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. రాస్తారోకో లో మహిళలు, పిల్లలు సైతం పాల్గొన్నారు. పంటపొలాల్లో కాలుష్యం నింపే పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ముందు జాగ్రత్తగా భైంసా నుంచి వచ్చే బస్సులను నర్సాపూర్ లో నిలిపివేశారు. జాతీయ రహదారిపై దిలావర్పూర్ బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించగా, మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొ్న్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే, తదితర నాయకులు కనబడటం లేదంటూ ప్ల కార్డుల ప్రదర్శించారు. నాయకులకు , ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కొన్ని నెలలుగా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ నిరసనలు
ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజారోగ్యంతోపాటు పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని. పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆందోళనబాట పట్టిన రైతులు, సమీప గ్రామ ప్రజలు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. గుండంపల్లి, దిలావర్‌పూర్ ప్రజలు, రైతులు జేఎసీలు ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నాయి. గుండంపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దాదాపు 120 రోజులకు పైగా ఈ ఆందోళనలు సాగుతున్నాయి. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని స్థానిక అధికారులు, జిల్లా కలెక్టర్‌కు తీర్మానాలు కూడా అందజేశారు.