ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌

Assembly elections in five states:దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలతో కలిసి ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటే వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, బెంగాల్, అసోం రాష్ట్రాల్లో 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపింది. అలాగే ఈ ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 2.19 లక్షలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం 25 లక్షల మంది అధికారులు విధుల్లో పాల్గొంటారని స్పష్టం చేసింది. ఓటింగ్ లో యువత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చింది. అక్రమ ఓటర్లను ఏరివేయడానికి సర్ కొనసాగుతోందని సీఈసీ ప్రకటించింది. అన్ని పోలింగ్ స్టేషన్లలలో 100 శాతం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఈసీ స్పష్టం చేసింది.

అస్సాంలో ఏప్రిల్‌ 9న పోలింగ్‌, మే 4న కౌంటింగ్‌
పుదుచ్చేరిలో ఏప్రిల్‌ 9న పోలింగ్‌, మే 4న కౌంటింగ్‌
తమిళనాడులో ఏప్రిల్‌ 23న పోలింగ్‌, మే 4న కౌంటింగ్‌
బెంగాల్‌లో ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో పోలింగ్‌
కేరళలో ఏప్రిల్‌ 9న పోలింగ్‌, మే 4న కౌంటింగ్‌
6 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు
2.19 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు-సీఈసీ
విధుల్లో 25 లక్షల ఎన్నికల సిబ్బంది ఉంటారు-సీఈసీ

You might also like