పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ లక్ష్యం
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుందని కొమురం భీమ్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ పునరావాస కాలనీలో రేషన్ కార్డు లబ్ధిదారుడు తాక్సండే శంకర్ ఇంట్లో ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యంతో తయారు చేసిన భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి పేదవాడికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. తద్వారా రేషన్ కార్డుదారులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సన్న బియ్యం అందుతాయన్నారు. జిల్లాలో మొత్తం 314 చౌక ధరల దుకాణాల ద్వారా 3 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో 100 శాతం చౌక ధరల దుకాణాల ద్వారా అర్హత గల లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందన్నారు.
లబ్ధిదారుడు తాక్సండే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం, జిల్లా కలెక్టర్ తన ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంతకుముందు కిరాణా దుకాణాలలో సన్న బియ్యం కొనుగోలు చేసేవారని, ఇప్పుడు ఖరీదు చేసే అవసరం లేకుండా ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, తహసిల్దార్ రోహిత్ కుమార్ పాల్గొన్నారు.