యాదగిరిగుట్టకు టీటీడీ మోడల్
-యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
-భూముల కేటాయింపుల్లో టీటీడీ విధానాన్ని అమలు చేయాలని ఆదేశం
-మఠాలకు భూములిచ్చినా హక్కులు దేవస్థానానికే
-భూసేకరణకు తక్షణ నిధులు
-పీపీపీ మోడల్‌లో టూరిజం సర్క్యూట్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయింపునకు పారదర్శకమైన విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల యాజమాన్య హక్కులు పూర్తిగా దేవస్థానానికే ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూముల కేటాయింపులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి, అదే తరహాలో నిబంధనలు రూపొందించాలని సూచించారు.
హరే రామ హరే కృష్ణ (చారిటబుల్) ఫౌండేషన్‌కు మార్కెట్ ధర ప్రకారం భూమి కేటాయించాలని, గుట్టపై అతిథి గృహాల నిర్మాణానికి ముందుకు వచ్చే వారి జాబితా సిద్ధం చేసి, టీటీడీ తరహాలో దశలవారీగా అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. అలాగే కుల సంఘాలకు స్థలాల కేటాయింపుపైనా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని పేర్కొన్నారు. ఆలయ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూ సేకరణకు తక్షణమే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ నిర్మాణంపై ఇంజనీర్ల కమిటీ సమర్పించిన నివేదికను సమగ్రంగా పరిశీలించి, వారంలోపు తుది నివేదిక అందజేయాలని సూచించారు.
పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో యాదగిరిగుట్ట టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దేవాదాయ, ఆర్థిక శాఖల అధికారులు, లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.