పశ్చిమ కాంగ్రెస్‌లో పరేషాన్
-అధికారంలో కాంగ్రెస్... ఆధిపత్యం ప్రతిపక్షాలదే అంటూ నేతల ఆవేదన
-ఎమ్మెల్యేలను సైతం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
-సొంత పార్టీలోనే అసంతృప్తి సెగ
-హస్తం నేతల్లో పెరుగుతున్న అసహనం
అధికారంలో ఉన్నది మనం…. ఆధిపత్యం మాత్రం ప్రతిపక్షాలది… పార్టీ పని చేసింది మనం… ఫలితాలు అనుభవిస్తుంది వాళ్లు… పదవులు రావడం లేదు… అధికారులూ మాట వినడం లేదు… మేం చేయాలో చెప్పండి.. ఇదీ పశ్చిమ కాంగ్రెస్ నేతల్లో అసమ్మతి జ్వాలల తీరు… ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు ఇలా అందరిది అసంతృప్తి బాటే… వారి మాట ఒక్కటే… మమ్మల్ని పట్టించుకోవడం లేదని… ఇంతకీ పశ్చిమ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..? వారి అంసతృప్తి కారణం ఏంటి..? నాంది న్యూస్ ప్రత్యేక కథనం..
“కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే.. ఇక్కడ నడుస్తోంది మాత్రం పక్క పార్టీల నేతల పెత్తనమే” అంటూ సొంత పార్టీ మంత్రులు, అధికారులపై స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల హస్తం పార్టీ నేతల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి, నైరాశ్యం అలుముకున్నాయి. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, జిల్లాల్లో మాత్రం ప్రతిపక్ష నేతలకే ప్రాధాన్యం దక్కుతోందంటూ సొంత పార్టీ నేతలు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతో సహా నేతలంతా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే తమ అసంతృప్తి బయటపెట్టారు. “అసలు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా.. బీజేపీనా?” అంటూ మంత్రినే నేరుగా ప్రశ్నించడంతో సభలో ఉన్నవారంతా అవాక్కయ్యారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వెంకట్ చేసిన వ్యాఖ్యలు ఈ అసంతృప్తికి మరింత బలం చేకూర్చాయి. తన నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ మాట కంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతల మాటే అధికారులు ఎక్కువగా వింటున్నారని, బదిలీలు, పోస్టింగులు, ఔట్‌సోర్సింగ్ నియామకాలు, కాంట్రాక్టుల విషయంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని పక్కనపెడుతున్నారని ఆరోపించారు. మంత్రులు ఇస్తున్న లేఖలను పట్టుకుని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ (ఆదిలాబాద్), మహేశ్వర్ రెడ్డి (నిర్మల్), బీఆర్‌ఎస్ నేత జోగు రామన్నలు తమ పనులు చేయించుకుంటున్నారని, అధికారులు సైతం వారికే ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ నేతలను ఖాతరు చేయడం లేదని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్ర స్వరంతో మండిపడ్డారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, వెడ్మ బొజ్జు వెంకట్‌తో పాటు పలువురు నాయకులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
మరోవైపు, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ఇప్పటికీ నామినేటెడ్ పదవులు రాకపోవడం, ప్రభుత్వ కమిటీల్లో చోటు లేకపోవడం, అధికారిక కార్యక్రమాల్లో సరైన గౌరవం దక్కకపోవడం కూడా అసంతృప్తికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు, నిధుల కేటాయింపులు కూడా తమకు ప్రాధాన్యం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఖానాపూర్ మినహా మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటంతో, వారికే మంత్రులు ప్రాధాన్యం ఇస్తున్నారనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో పెరుగుతోంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది.
మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఆవేదనను అధిష్టానం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా అసంతృప్తి తగ్గినా, నామినేటెడ్ పదవులు, రాజకీయ ప్రాధాన్యత, అధికార యంత్రాంగం వ్యవహారశైలిపై త్వరలోనే స్పష్టత వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో వినిపిస్తున్న అసంతృప్తి రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.