శ‌భాష్ ఎస్పీ మేడ‌మ్‌..

తునికాకు కోసం వెళ్లిన న‌లుగురు మ‌హిళ‌లు
రాత్రంతా అడ‌విలో జాగారం
స్వ‌యంగా రంగంలోకి దిగి ఎస్పీ జాన‌కి ష‌ర్మిళ‌
బాధితుల‌ను తీసుకురావడంతో ఆనందంలో గ్రామ‌స్తులు

Nirmal District SP Janaki Sharmila: ఆ అడ‌విలో రంగంలోకి కూంబింగ్ పార్టీలు.. స్పెష‌ల్ పార్టీ పోలీసులు.. రాత్రంతా గాలింపులు.. డ్రోన్ల‌తో వెతుకులాట‌.. ఎస్పీ, ఏఎస్పీ ప‌ర్య‌వేక్ష‌ణ‌.. అడ‌విలో పోలీసుల బూట్ల చ‌ప్పుడు.. ఇదంతా చూస్తుంటే… ఏదో మావోయిస్టుల కోసం పోలీసుల వేట‌లాగా అనిపిస్తోంది క‌దా.. కానీ, అడ‌విలోకి వెళ్లి త‌ప్పిపోయిన మ‌హిళ‌ల కోసం పోలీసుల అన్వేష‌ణ అది.. తూనికాకు కోసం వెళ్లిన మ‌హిళ‌లు రాత్రంతా అడ‌విలో ఉంటే వారిని పోలీసులు కాపాడి తీసుకురావ‌డంతో గ్రామ‌స్తుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి..

నిర్మ‌ల్ జిల్లా మామ‌డ మండ‌లం క‌ప్ప‌న‌ప‌ల్లి గ్రామానికి చెందిన న‌లుగురు మ‌హిళ‌లు తునికాకు కోయ‌డానికి అడ‌విలోకి వెళ్లారు. రాజుల రాధ, కంబాల లింగవ్వ, ⁠గట్లమీది లక్ష్మి , ⁠బత్తుల సరోజ అనే మ‌హిళ‌లు గ్రామ సరిహద్దులో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కి గురువారం సాయంత్రం 4 గంటలకు తునికి ఆకులు తెంపడానికి వెళ్లి దారి తప్పారు. ఎటు వెళ్లాలో తెలియ‌ని స్థితిలో బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డిపారు. విష‌యం తెలుసుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల స్వయంగా రంగంలోకి దిగారు. ఆమెతో పాటు ఏఎస్పీ రాజేష్ మీనా సంయుక్తంగా మూడు స్పెషల్ పార్టీ బృందాలతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

అధునాతన సాంకేతికత, ట్రాకింగ్ వ్య‌వ‌స్థతో పాటు డ్రోన్ల‌ను ఉప‌యోగించారు. అరుపుల‌తో పాటు గ్రామ‌స్తుల‌ను సైతం వారి వెంట తీసుకువెళ్లారు. ఆ అడవిలో ఉన్న‌ న‌లుగురు మ‌హిళ‌ల‌ను గుర్తించారు. వారు భీమన్న గుట్టపై ఉన్న‌ట్లు తెలుసుకుని సురక్షితంగా గ్రామానికి ఎస్పీ స్వ‌యంగా తీసుకువ‌చ్చారు. గ్రామస్తులందరూ ఎస్పీ, పోలీస్ బృందాన్ని పూలతో అభినందించారు. ఎస్పీ జాన‌కీ ష‌ర్మిల‌ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురైనా పోలీసులు మీ సొంత కుటుంబం లాగా రక్షణగా ఉంటామని హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాలకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాల‌ని ఆమె వెల్ల‌డించారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న రాజేష్ మీనా, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్ రెడ్డి, ఆర్ ఐ లు శేఖర్, రమేష్ , మ‌హిళా పోలీసు శివాజ్ఞి బృందాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like