ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తే.. ఇంట్లో కూర్చుంటారు..
Former MLA Nadipelli Diwakar Rao is serious about the behavior of the officials: మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అవినీతికి కొమ్ముకాస్తున్న అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హెచ్చరించారు. ఆయన మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశం రాజకీయాల కోసం కాదని, అధికారులను ఆలోచించమని చెప్పడానికి ఏర్పాటు చేసిందన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ ఈ ప్రాంతం నుండి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం చేయని పనులకు బిల్లులు రాయాలని, చేసిన పని కంటే ఎక్కువ బిల్లులు ఇవ్వమనడంతో తన ఉద్యోగం పోతుందనే భయంతో ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయారని ఈ ప్రాంత ప్రజలు కోడై కూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని,మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు ఓటమి ఖాయం అయిపోయిందన్నారు. మితిమీరిన అవినీతి, దాడులు, ప్రతి వెంచర్ దగ్గర డబ్బులు వసూలు, తప్పుడు కేసులు, ప్రతి భూమి వ్యవహారంలో తలదూర్చడం వంటివి ఆయన ఓటమికి కారణాలు అవుతాయన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానేనని, మంచిర్యాల నియోజకవర్గంలో కూడా గులాబీ జెండా ఎగురుతుందన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం శూన్యమని, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలంటే దళారులు, అధికారులు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులుగా ఈ ప్రాంతానికి, ప్రజలకు మా నాయకులు,కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకోవడమే మా బాధ్యత అని నడిపల్లి స్పష్టం చేశారు.
కొంతమంది అధికారులు రాబోయే ఆపద ముందే గ్రహించి ఇక్కడి నుంచి వెళ్లిపోయారని, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తున్నారని దివాకర్ రావు దుయ్యబట్టారు. వాళ్లపై భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. గోదావరిలో ఉన్న ఇసుక ను,మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారని, దానికి సహకరించిన అధికారులను వదిలిపెట్టమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని కూలగొట్టడానికి సహకరించిన అధికారులపై తప్పకుండా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కోట్లాది రూపాయలతో కట్టిన వెంకటేశ్వర థియేటర్, లక్ష్మీ టాకీస్ జంక్షన్లను అక్రమంగా కూలగొట్టిన అధికారులను వాళ్ళ జీవితం మొత్తం చట్టపరంగా బాధపడేలా చేస్తామన్నారు.
తప్పులు చేసి మేము రిటైర్ అయిపోతాం. ఈ మాకేమవుతుంది అనుకునే అధికారులకు,భవిష్యత్తులో మీకు పెన్షన్ కూడా రాకుండా చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 20న బెల్లంపల్లి చౌరస్తాలో తాము ధర్నా చేస్తే ప్రజలకు అసౌకర్యం కలిగిందని కేసు పెట్టారని, అదే రోజు అదే ప్రాంతంలో కాంగ్రెస్ వాళ్ళ ధర్నా చేస్తే వారి మీద కేసు పెట్టని అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఏ తప్పులు చేయని తమ నాయకులు మందిపెల్లి శ్రీనివాస్, గడప రాకేష్, బేర సత్యనారాయణ, అంకం నరేష్, గొల్ల శ్రీనివాస్, సిరాజ్, కందుల ప్రశాంత్, దగ్గుల మధు, రావుల రాజేశం, అక్కల రవి, ఓరగంటి శ్రీకాంత్, మల్లేష్ రాపల్లి, నక్క తిరుపతిలపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులకు పాల్పడిన అధికారులను వదిలిపెట్టమన్నారు.
కొంతమంది అధికారులు అయితే వాళ్లే స్వయంగా తమపై అన్యాయంగా పిటిషన్ ఇస్తు తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారని వారిని సైతం వదిలేది లేదన్నారు. ఈ మూడు సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మిగిలి ఉన్న మీ సర్వీస్ అంతా ఇంట్లో కూర్చుంటారో లేక న్యాయంగా భవిష్యత్తులో మీ డ్యూటీ మీరు చేసుకుంటారో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది,అది మీ చేతుల్లోనే ఉందని నడిపెల్లి అధికారులకు స్పష్టం చేశారు. ప్రేమ్ సాగర్ రావుది ఏమున్నది రేపు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ కు పరిమితం అవుతారు… కానీ ఇవాళ తప్పు చేసిన అధికారులు ఎక్కడికి పోతారని అన్నారు.