“స‌ర్” లో పొర‌పాట్ల‌కు తావీయ‌వ‌ద్దు

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లో ఎలాంటి పొర‌పాట్లకు తావీయ‌వ‌ద్ద‌ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండ‌లం వెంకటరావుపేటలో నిర్వ‌హిస్తున్న స‌ర్ ప్ర‌క్రియ ప‌రిశీలించి బూత్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్యుమరేషన్ ఫారాలు అందించ‌డం, తిరిగి సేకరించడం, వివరాల నమోదు అంశాలలో జాగ్రత్త వహించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

అంత‌కుముందు క‌లెక్ట‌ర్‌ లక్షెట్టిపేట 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వార్డులు, రిజిస్టర్లు, ల్యాబ్, పరిసరాలను పరిశీలించారు. అధిక శాతం నమోదు అవుతున్న వ్యాధులు, అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అవసరమైన మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది నిధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు.

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యా రంగంలో ఆచరణాత్మక మార్పులను తీసుకువస్తూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించి తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు. కొనసాగుతున్న మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 

You might also like