జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసనలు
- లేబర్ కోడ్‌లను రద్దు చేసి , 12వ వేతన ఒప్పందం ప్రారంభించాలని డిమాండ్
- గేట్ మీటింగ్‌లు, జూలై 1న హెడ్ ఆఫీస్ ఎదుట భారీ ఆందోళన
- జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య నాయకుల వెల్లడి
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి, JBCCI-12వ వేతన ఒప్పందం తక్షణమే ప్రారంభించాలని జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. INTUC, AITUC, CITU, HMS సంఘాల నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC)గా ఏర్పడి తమ కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మిక వ్యతిరేకమైన ఈ నాలుగు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే బొగ్గు పరిశ్రమ కార్మికులకు అత్యంత కీలకమైన JBCCI-12వ వేతన ఒప్పందం ప్రక్రియను లేబర్ కోడ్‌ల పేరుతో జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే JBCCI-12వ వేతన ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో జూలై 1న సంయుక్తంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 29న శ్రీరాంపూర్, భూపాలపల్లిలో గేట్ మీటింగ్, జూన్ 30న కొత్త గూడెంలో గేట్ మీటింగ్ లు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. జూలై 1న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో INTUC నాయకులు డా. బి. జనక్ ప్రసాద్, నరసింహారెడ్డి, ధర్మపురి, AITUC నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, మడ్డి ఎల్లయ్య, CITU నాయకులు రాజిరెడ్డి, రాజమౌళి, HMS నాయకులు సారయ్య, అనిల్ రెడ్డి పాల్గొన్నారు.