15 రోజుల లోపు ఎన్నికలు నిర్వహించండి
Devapur Orient Cement Factory Elections: ఎట్టకేలకు దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికలు ఒక కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. 15 రోజుల లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఓరియంట్ సిమెంట్ కార్మిక సంఘ ఎన్నికలు జాప్యం అవుతున్న నేపథ్యంలో వెంటనే ఎన్నికలు జరిగేలా చూడాలని కార్మిక సంఘం నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు పదిహేను రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వాస్తవానికి ఈ ఎన్నికలు ఎప్పుడో నిర్వహించాల్సి ఉంది. కానీ, ఒక వర్గం కావాలనే ఎన్నికలు ఆలస్యం చేస్తోందని కార్మిక సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరమ్మ కార్మిక యూనియన్లతో సమావేశం సైతం నిర్వహించారు. ఐదు యూనియన్లకు గుర్తులు కేటాయించారు. ఈ నేపథ్యంలో మరోసారి కార్మిక సంఘాల నేతలతో సమావేశం కావాల్సిన డీఎల్సీ సెలవుపై వెళ్లారు. దీంతో కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కార్మిక సంఘం నేతలు కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు పదిహేను రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో కార్మిక సంఘాలు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం – సత్యపాల్ రావు,
కోర్టు తీర్పు కార్మికుల విజయం. కేవలం ఎన్నికలు నిర్వహించేలా చేసేందుకే సంవత్సరానికి పైగా పట్టిందంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కార్మికుల సమస్యల పరిష్కారంలో అధికార యూనియన్ పూర్తిగా విఫలం అయ్యింది. కార్మికులు ప్రస్తుతం అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓరియంట్ సిమెంట్ చేతులు మారడంతో తమ ఉద్యోగాలు ఉంటాయా..? పోతాయా…? అని భయపడుతున్నారు. కనీసం వారికి భరోసా కల్పించలేని దుస్థితి. మేం ఖచ్చితంగా ఆ విషయంలో పోరాటం చేస్తాం. కొత్త ఉద్యోగాలు సైతం కల్పించేలా చర్యలు తీసుకుంటాం. కార్మికులకు సరైన క్వార్టర్లు లేవు. వారికి ఇన్సూరెన్స్ కేవలం రెండు లక్షలు మాత్రమే ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెండు లక్షలు ఏ మాత్రం సరిపోవు. ఆ ఇన్సూరెన్స్ పెంచేలా పోరాటం చేస్తాం. గతంలో ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేసిన దుస్థితి. మేం యూనియన్ ఎన్నికల్లో గెలిచాక అలాంటివి ఏం లేకుండా చర్యలు తీసుకుంటాం.