బెంగాల్ చీఫ్‌ సెక్రటరీపై వేటు..!

West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీలను తక్షణమే ఆ పదవుల నుంచి తప్పిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలను స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆదివారం షెడ్యూల్‌ విడుదలైంది. ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) దేశ రాజధాని ఢిల్లీలో మీడియా సమావేశం (Press Meet) ఏర్పాటు చేసి.. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది.

అయితే, పశ్చిమబెంగాల్‌ ఎన్నికలకు సంబంధించి ఈసీ తీసుకున్న నిర్ణయం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తిని ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ స్థానంలో దుష్యంత్‌ నరియాను నియమించింది. హోంశాఖ కార్యదర్శి జగదీశ్‌ ప్రసాద్‌ మీనాను సైతం ప‌క్క‌న పెట్టాల‌ని ఈసీ నిర్ణ‌యించింది. ఈ పదవిలో ఐఏఎస్‌ అధికారి సంఘమిత్ర ఘోష్‌ని నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు నందిని చక్రవర్తి, జగదీశ్‌ ప్రసాద్‌ మీనాకు ఎలాంటి పోలింగ్‌ సంబంధిత విధులు అప్పగించవద్దని పశ్చిమబెంగాల్‌ సర్కారును ఈసీ ఆదేశించింది. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన తర్వాత ఆ ఇద్దరినీ విధులకు దూరంగా ఉంచినట్టు తెలిపింది.

సీఎస్‌, హోంశాఖ కార్యదర్శి జగదీష్‌ ప్రసాద్‌ మీనాను ఈసీ తొలగించడాన్ని నిరసిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఇవాళ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. ఇక బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 23న, 29న రెండు విడతలుగా జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది. కాగా ఇటీవల ఓటర్ల జాబితా, సవరణల లాంటి విషయాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఎలక్షన్‌ కమిషన్‌ల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి.

You might also like