ప్రభుత్వానికి చేరిన కాళేశ్వరం నివేదిక
Kaleshwaram report reaches the government:కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. బీఆర్‌కే భవన్‌కు వెళ్లి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదికను షీల్డ్ కవర్‌లో అందజేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, అవినీతి ఆరోపణలపై 15 నెలల పాటు విచారణ జరిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి పూర్తి విచారణ చేశారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కమిషన్ అందించిన నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు .
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ 2023 ఆఖర్లో కుంగిపోయింది. ప్రాజెక్టుకు సంబంధించిన పియర్స్ దెబ్బతినడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఘటనపై విజిలెన్స్ విచారణతోపాటు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)తో అధ్యయనం చేయించింది. లోపాలు తీవ్రంగా ఉన్నట్లు విజిలెన్స్ ప్రాథమిక నివేదిక సమర్పించింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా న్యాయ విచారణకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడంతో పాటు వెంటనే కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో కమిషన్ ఏర్పాటు చేసింది. జులై ఆఖరులోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడంతోపాటు ఎక్కువ మందిని విచారించాల్సి రావడం, క్రాస్ ఎగ్జామినేషన్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికల పరిశీలన.. ఇలా పలు కారణాలతో కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.