వరుసగా 12వ సారి..
Independence Day Parade At Red Fort: దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దిల్లీలో ఎర్రకోటపై మువ్వెన్నెల జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. 2047 వికసిత భారత్ విజన్‌తో, నయా భారత్ థీమ్‌తో పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. మోదీకి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని రక్షణ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు.
ఎర్రకోటపై 12వసారి భారత ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సుసంపన్న.. సురక్షిత.. సాహసోపేత నవ భారత్ సాకారమే లక్ష్యంగా భారత్ తన 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరుగుతోంది. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున సందర్శకులు హాజరయ్యారు. వారి కోసం అధునాతన సీటింగ్ వ్యవస్థ, భారీ LED స్క్రీన్లు, స్పీకర్లు ఏర్పాటు చేశారు. వేదిక ముందు నవభారత్ కూర్పుతో విద్యార్దులు, NCC కేడేట్లు కూర్చున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ హైలెట్ అయ్యేలా నేషన్ ఫస్ట్ బ్యానర్లు ఏర్పాటు చేశారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, ప్రత్యేక కమాండోలు సహా 15 వేల మంది భద్రత విధుల్లో ఉన్నారు. ఎర్రకోటకు మూడు కిలో మీటర్ల పరిధిని భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీజీ, ప్రధాని భద్రత, ఢిల్లీ పోలీసులు ఎర్ర కోట లోపల భద్రతను ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 500 పైగా కెమెరాలు ఎర్ర కోట లోపల ఏర్పాటు చేశారు. అనుమానితులను గుర్తించేందుకు ఎర్రకోట వద్ద AIతో కూడిన 700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.