శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద విషాదం..!
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృత్యువాతపడగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం సమీపంలో, ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ కారు అతివేగంతో వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.
కారులో ప్రయాణిస్తున్న సాయి సుశీల్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను స్థానికులు, వాహనదారులు ఎంతో శ్రమించి, కారు తలుపులు పగలగొట్టి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన వారు లక్షెట్టిపేట స్వస్థలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు మంచిర్యాలలో నివాసముంటున్నట్లు తెలిసింది. మృతి చెందిన సాయి సుశీల్ తల్లిదండ్రులు శారద, నరేందుల కృష్ణమోహన్ ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.