కాంగ్రెస్‌లో బీజేపీ ఎమ్మెల్యేల‌కు ప్రాధాన్య‌త‌

-ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అస‌హ‌నం
-ఎమ్మెల్యేగా ఉన్నా ఏం జ‌రుగుతుందో తెలియ‌డం లేదు
-అధికారుల‌పైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఎమ్మెల్యే
-రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా బొజ్జు వ్యాఖ్య‌లు

Khanapur MLA Vedma Bojju: కాంగ్రెస్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యేల‌కే అధిక ప్రాధాన్య‌త ల‌భిస్తోంద‌ని ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సొంత ప్రభుత్వంపైనే ఆయన బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్, నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే (మహేశ్వర్ రెడ్డి)లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనివల్ల క్షేత్రస్థాయిలో కష్టపడిన కాంగ్రెస్ నేతలు దూరం అవుతున్నార‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో మనకు పోటీగా ఉండే ప్రత్యర్థి పార్టీల నాయకులను దగ్గరకు తీసుకోకూడదని, వారికి ఇలాగే ప్రాధాన్య‌త‌ ఇస్తూ పోతే కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని హెచ్చరించారు. “నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా నా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి” అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇతర పార్టీల నాయకులు నేరుగా హైదరాబాద్ వెళ్లి మంత్రుల వద్ద నుండి లెటర్లు తెచ్చుకుంటున్నారని, ఇక్కడి అధికారులు వారికి పనులు చేసి పెడుతున్నారని… కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన తనకు మాత్రం ఎలాంటి సమాచారం ఉండటం లేదని అధికారుల తీరుపై మండిపడ్డారు. సొంత పార్టీ మంత్రులు, అధికారుల ప్రోటోకాల్‌పై ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ స్థాయి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like