భయపడం.. వెనకడుగు వేయం..
Election Commission of India:”రాజ్యాంగపరమైన విధుల నుంచి మేం తప్పుకోం. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్ల మీద గురిపెట్టి రాజకీయం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కేవలం భారత పౌరులకే ఓటు హక్కు ఉంటుంది. ఇతర దేశాల వారికి ఈ హక్కు ఉండదు.. మీ బెదిరింపులకు ఈసీ భయపడదు”. భారత ఎన్నికల కమిషన్
బీహార్ ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేసిన విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. బీహార్‌లో ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు సమయం ఇచ్చామన్నారు. ఇంకా 15 రోజుల సమయం ఉందన్నారు. దరఖాస్తు చేసుకోకుండా ఎలా ఓటు హక్కు వస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మధ్య వివక్ష ఎలా చూపుతుందని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌కు అన్ని పార్టీలు సమానమేననిన్నారు.
రెండు దశాబ్దాలుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఓటరు జాబితాలోని తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. అందు కోసమే ఎన్నికల సంఘం బీహార్ నుంచి ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ప్రారంభించిందని ఆయన తెలిపారు. సర్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, అన్ని రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన 1.6 లక్షల మంది బీఎల్‌ఏలు కలిసి ముసాయిదా జాబితా సిద్ధం చేశారన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. ఓటరు జాబితా ప్రతి పార్టీ బూత్ లెవల్‌లో చూసుకుంటుందని స్పష్టం చేశారు.బీహార్‌లో ఓటరు జాబితా సంస్కరణలో అన్ని పార్టీలు పాల్గొంటున్నాయని చెప్పారు. రాజ్యాంగ సంస్థలను అవమానించడం ఏమాత్రం సరికాదన్నారు.
ఓట్ల చోరీ అంటూ ప్రచారం చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని, దుష్ప్రచారాల పట్ల ఏ మాత్రం భయపడమని.. ఎన్ని ఆరోపణలు వచ్చినా తాము పని చేసుకుంటూ వెళ్తామన్నారు. ఈసీ పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. ఓటరు జాబితా బూత్ లెవల్ అధికారులు, పార్టీలు, ఏజెంట్లు కలిసి పరిశీలిస్తారన్నారు. ఈసీ తలుపులు అందరికీ తెలిచే ఉంటాయన్నారు. పార్టీలు, నేతల పట్ల మాకు భేదభావాలు.. పక్షపాతాలు ఉండవని సీఈసీ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఓటరు జాబితాలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఓట్ల చోరీ సాధ్యమా? అని ప్రశ్నించారు. తన ఆరోపణలకు రుజువులు సమర్పించాలని, లేదా దేశానికి క్షమాపణలు చెప్పాలని గాంధీని డిమాండ్ చేసింది.